ScienceAndTech

యూపీ బాలుడికి నాసా అవకాశం-NewsRoundup-Jan 27 2025

యూపీ బాలుడికి నాసా అవకాశం-NewsRoundup-Jan 27 2025

* సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పుష్ప2: ది రూల్‌’ (pushpa 2 ott release) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ రీలోడెడ్‌ వెర్షన్‌ను డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (pushpa 2 ott release platform) వేదికగా అందుబాటులో ఉండనుంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద రూ.1896 కోట్లు (pushpa 2 collection worldwide) వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

* మహారాష్ట్ర (Maharashtra)లో గిలైన్ బారె సిండ్రోమ్‌ (GBS) కలకలం సృష్టిస్తోంది. తాజాగా సోలాపుర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించగా.. అందుకు జీబీఎస్‌ (Guillain-Barre Syndrome) కారణమని అనుమానిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. పుణెలో ఇప్పటివరకు నమోదైన జీబీఎస్‌ కేసుల సంఖ్య 101కి చేరుకుంది. వారిలో 16 మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వ్యక్తి కూడా పుణెలోనే చికిత్స పొందాడు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది. ఆ రుగ్మత బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు.. నడిరోడ్డుపై పరస్పరం తుపాకులతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. భాజపా మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్, స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ తమ అనుచరులతో కలిసి రూర్కీలో వీరంగం సృష్టించారు. ఒకరి కార్యాలయాలపై మరొకరి అనుచరులు రాళ్లను విసురుతూ ఘర్షణకు దిగారు. తొలుత ఛాంపియన్… కుమార్ ఆఫీసుపై అనేక రౌండ్లు కాల్పులు జరపగా.. తర్వాత ఛాంపియన్ కార్యాలయంపై కుమార్‌ తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసులు ఇద్దరు నేతలపై కేసులు నమోదు చేశారు.

* చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఆయన అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని (Illegal immigrants) గుర్తించే క్రమంలో గురుద్వారాలనూ వదలడం లేదు. హెమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన అధికారులు న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోని ఈ ప్రార్ధనా మందిరాల్లోనూ తనిఖీలు చేయడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతకు ఈ చర్య ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వేర్పాటువాదులు, అధికారిక పత్రాలు లేని వలసదారులు వీటిని ఉపయోగించుకోవచ్చంటూ అమెరికా స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

* రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సొమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను రూ.530 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

* బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడి ఘటనపై ముంబయి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు వినియోగించిన సిమ్‌ కార్డు ఈ మహిళ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ‘‘నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళకు సైఫ్‌పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉంది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటినుంచి ఈ మహిళతో టచ్‌లో ఉన్నాడు’’ అని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ముంబయి నుంచి వచ్చిన పోలీసులు ఈమెను అరెస్టు చేశారని చెప్పారు.

* ఆర్జీకర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సోమవారం కలకత్తా హైకోర్టు విచారించింది. దోషికి మరణశిక్ష విధించాలని కోరడం లేదని ఈసందర్భంగా మృతురాలి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. గతఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన (Kolkata Doctor Murder Case) కేసుపై ఇటీవల విచారణ జరిపిన కోల్‌కతాలోని సియాల్దా కోర్టు దోషి సంజయ్‌రాయ్‌కు జీవితఖైదు విధించింది. ఇది అరుదైన కేసు పరిధిలోకి రాదని వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దోషికి ఈ శిక్ష సరిపోదన్నారు. మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సర్కార్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వంతో పాటు సీబీఐ కూడా ఇదే డిమాండ్‌తో స్థానిక కోర్టు తీర్పును సవాల్ చేసింది.

* దారిద్ర్యరేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. వివిధ అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్‌ డీడ్‌ ఇస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్‌ హక్కులు కల్పించేలా కన్వేయన్స్‌ డీడ్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారు. ఇంటిపట్టా ఇచ్చిన రెండేళ్లలోగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

* ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన విద్యార్థి దక్ష్ మాలిక్ (14) అరుదైన ఘనతను సాధించాడు. తాను కనుగొన్న గ్రహశకలానికి తనే పేరు పెట్టే అవకాశాన్ని నేషనల్‌ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) అతడికి ఇచ్చింది. నాసాతో భాగస్వామి అయిన ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్‌ డిస్కవరీ ప్రాజెక్టు (IASC) కింద 2023లో దక్ష్‌ మలిక్‌ (Daksh Malik) తన స్నేహితులతో కలిసి ఓ గ్రహశకలాన్ని గుర్తించాడు. ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ (IADP) కింద దక్ష్ తన ఇద్దరు స్నేహితులకు 2022లో గ్రహశకలాన్ని కనుగొనేందుకు అవకాశం లభించింది. వారి స్కూల్‌కు చెందిన ఆస్ట్రోనమీ క్లబ్‌ నాసా ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనమికల్‌ సెర్చ్‌ కొలాబరేషన్‌(IASC)కు మెయిల్‌ పంపడంతో వారికి ఈ అవకాశం లభించింది. దీంతో ఏడాదిన్నరపాటు అంతరిక్షాన్ని శోధించి 2023లో ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. నాటి నుంచి దాని పేరు 2023 OG40గా కొనసాగుతోంది. ప్రస్తుతం దానికి శాశ్వత పేరును పెట్టే అవకాశాన్ని నాసా కల్పించింది. దీనిపై దక్ష్ మాలిక్ స్పందిస్తూ చిన్ననాటి నుంచి తనకు అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేదన్నాడు. గ్రహాలు, సౌర వ్యవస్థకు సంబంధించిన నేషనల్ జియోగ్రాఫిక్‌ డాక్యుమెంటరీలు తరచూ చూసేవాడినని పేర్కొన్నాడు. తాను ఎన్నాళ్లగానో కన్న కల ఇప్పడు సాకారం అయ్యిందని ఆనందం వ్యక్తం చేశాడు. దీన్ని కనుగొనడానికి పని చేస్తున్న క్రమంలో తాను నాసాలో పని చేస్తున్న శాస్త్రవేత్తలా ఊహించుకునేవాడినని తెలిపాడు. ప్రస్తుతం తమ మనసులో ‘డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్,’ ‘కౌంట్‌డౌన్’ వంటి పేర్లు ఉన్నాయని తెలిపాడు.

* భాజపా (BJP), ఆర్‌ఎస్‌ఎస్‌లపై (RSS) కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజలను మరోసారి బానిసలుగా మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని (madhya pradesh) మహులో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మళ్లీ కోరుకుంటున్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మారుస్తున్నాయి. రాజ్యాంగం మారిన రోజు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)కు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబారామ్‌దేవ్‌ కూడా పుణ్యస్నానమాచరించారు.

* దేశ రాజధాని దిల్లీలో (Delhi) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించింది. విద్యార్థులు, మహిళల ప్రయోజనాలే లక్ష్యంగా ఆప్‌ హామీల వర్షం కురిపించింది. పార్టీ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దీనిని విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్‌ యోజన, సంజీవని పథకం సహా తదితర హామీలు ఇందులో ఉన్నాయి. వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పతుల్లో ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వీటితో పాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. మొత్తం 15 గ్యారెంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని అన్నారు.

* గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని.. రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ (Anagani Satyaprasad) అన్నారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ త్వరలో ఉంటుందని అనగాని తెలిపారు. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉందన్నారు. కొన్ని చోట్ల తగ్గిస్తే.. మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించిన్నట్లు మంత్రి వెల్లడించారు.

* కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే అత్యాధునిక క్షిపణులను ఇరాన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో మోహరించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ రంగ మీడియా వెల్లడించింది. ‘‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ ఘెహమ్‌, అల్మాస్‌ క్షిపణులను ప్రయోగించింది. ఇవి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి. ప్రయోగం సందర్భంగా ఇవి విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయి’’ అని ఐఆర్‌ఎన్‌ఏ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z