Agriculture

హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో-BusinessNews-Feb 05 2025

హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో-BusinessNews-Feb 05 2025

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అనతికాలంలో పాపులర్‌ అయిన చైనాకు చెందిన ఏఐ చాట్‌బాట్‌ డీప్‌సీక్‌పై (Deepseek) అనుమానాలు మొదలయ్యాయి. అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వరంగ టెలికాం కంపెనీతో డీప్‌సీక్‌కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. కంప్యూటర్‌ కోడ్‌ ద్వారా యూజర్లకు చెందిన లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు చేరవేస్తోందని చెబుతున్నారు. ఆ మేరకు డీప్‌సీక్‌ వెబ్‌లాగిన్‌ పేజీలో కంప్యూటర్‌ స్క్రిప్ట్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అకౌంట్ క్రియేషన్‌, లాగిన్‌ ప్రక్రియ సందర్భంగా ఈ కోడ్‌ కనిపించిందని పేర్కొన్నారు. డీప్‌సీక్‌ ప్రైవసీ పాలసీ ప్రకారం.. డేటాను పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాలోని సర్వర్లలో స్టోర్‌ చేస్తోంది. కానీ, చైనా మొబైల్‌ (టెలికాం కంపెనీ పేరు)తో ఈ ఏఐ చాట్‌బాట్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. తొలుత కెనడాకు చెందిన ఫీరూట్‌ సెక్యూరిటీ సంస్థ దీన్ని గుర్తించి అసోసియేట్‌ ప్రెస్‌ వార్తా సంస్థతో పంచుకుంది. ఈ వివరాలను స్వతంత్ర కంప్యూటర్‌ నిపుణులు సైతం ధ్రువీకరించారు. అయితే డేటా బదిలీ జరిగిందా? లేదా అన్నది మాత్రం ఈ సంస్థలు గుర్తించలేదు. ఈ ఆరోపణలపై అటు డీప్‌సీక్‌ గానీ, చైనా మొబైల్‌ గానీ స్పందించలేదు. అయితే, ఇది డీప్‌సీక్‌ వెబ్‌ వెర్షన్‌కు సంబంధించిన అనాలసిస్‌ మాత్రమే.

* జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్‌ (Honda Motor), నిస్సాన్‌ మోటార్‌ (Nissan Motor) విలీనం కోసం గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విలీన ప్రక్రియ ముందుకు కొనసాగడం లేదని తెలుస్తోంది. హోండా కంపెనీతో విలీనం ప్రతిపాదనలను రద్దు చేసుకోవాలని నిస్సాన్‌ భావిస్తోందని సంబంధిత వ్యక్తులు తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో ఈ అంశంపై భేటీ అయి నిస్సాన్‌ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

* విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) రోడ్‌స్టర్‌ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను తాజాగా లాంచ్‌ చేసింది. ఇటీవలే మూడోతరం జనరేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన విద్యుత్‌ స్కూటర్లను లాంచ్‌ చేసిన కంపెనీ.. తాజాగా రోడ్‌స్టర్‌ ఎక్స్‌ (Roadster X), రోడ్‌స్టర్‌ ఎక్స్‌+ (Roadstr X+) పేరిట విద్యుత్‌ మోటార్‌సైకిల్స్‌ను విడుదల చేసింది. వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో ఇవి లభ్యమవుతాయి. వీటి ధర రూ.74,999 (ఎక్స్‌- షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. నేటి నుంచే బుకింగ్‌లు స్వీకరిస్తామని, వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) వెల్లడించారు.

* ఆర్డర్‌ చేసిన పదినిమిషాల్లోనే కిరాణా సరకులని ఇంటికి తెచ్చిస్తోంది ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో (Zepto). తర్వాత నుంచి గాడ్జెట్స్‌ ఆ జాబితాలో చేర్చింది. ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. టీజర్ రిలీజ్‌తో ఈ చర్చ మొదలైంది. స్కోడా ఇండియా ఈ వీడియోను షేర్ చేసింది. అందులో ఒక డెలివరీబాయ్‌ స్కోడా షోరూమ్‌ దగ్గరకు వస్తారు. తన ఆర్డర్ తీసుకెళ్లడానికి వచ్చినట్టు అక్కడ సిబ్బందికి చెప్తారు. దాంతో షోరూమ్ ఉద్యోగి అతడికి ఆర్డర్‌ను అప్పగిస్తారు. ఆ ఆర్డర్ స్కోడా కైలాక్‌ అని ఆ వీడియోను బట్టి తెలుస్తోంది. చివర్లో స్కోడా X జెప్టో: కమింగ్ సూన్ అని కనిపిస్తుంది. లాంచింగ్ డేట్‌ ఫిబ్రవరి 8 అని ప్రకటించారు. అంటే వీరిద్దరి భాగస్వామ్యంలో ఆ రోజునుంచే సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టు ద్వారా పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ.. జెప్టో వేదికగా ఈ కార్ల కొనుగోళ్లు చేసుకోవచ్చని సూచన ప్రాయంగా వెల్లడవుతోంది.

* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పొజిషన్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఆయన సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. తమ వద్దకు వచ్చిన 18 వేలకు పైగా అప్లికేషన్లలో 30 మందికి జాబ్‌ ఆఫర్లు అందించామని ఆయన తెలిపారు. తమతో కలిసి పనిచేసేందుకు ఎవరూ డబ్బు చెల్లించలేదని గోయల్‌ పేర్కొన్నారు. ‘‘మా వద్దకు వచ్చిన అప్లికేషనల్లో వడపోసి 150 మందిని ఎంపిక చేశాం. వారిలో 30 మందికి జాబ్‌ ఆఫర్లు అందించాం. అందులో 18 మంది ఇప్పటికే జొమాటో (బ్లింకిట్‌తో సహా) గ్రూప్‌లో అత్యున్నత స్థాయి హోదా కల్పించాం. వారు చేస్తున్న పనికి తగ్గట్లు వారికి జీతభత్యాలు చెల్లిస్తున్నాం. మాతో కలిసి పనిచేసేందుకు ఎవరూ డబ్బు చెల్లించలేదు’’ అని దీపిందర్‌ గోయల్‌ అన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు, అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండడం సూచీలు నష్టాలకు కారణమయ్యాయి. నిఫ్టీ 23,700 దిగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 78,704.60 (క్రితం ముగింపు 78,583.81) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఆఖర్లో మరింత ఆమ్మకాల ఒత్తిడితో 312.53 పాయింట్ల నష్టంతో 78,271.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 42.95 పాయింట్ల నష్టంతో 23,696.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 39 పైసలు క్షీణించి 87.46 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది.

* దిగుమతి సుంకం తగ్గించడంతో దేశంలో బంగారానికి (Gold) గిరాకీ పెరిగింది. దీనికి తోడు పెళ్లిళ్లు, పండగ సీజన్‌ కారణంగా 2024లో పసిడి డిమాండ్‌ 5శాతం పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) వెల్లడించింది. ఈ ఏడాదిలోనూ పుత్తడి గిరాకీ ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. 2024 ఏడాదికిగానూ ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగంపై ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) బుధవారం గణాంకాలు విడుదల చేసింది. దాని ప్రకారం, 2023లో బంగారం గిరాకీ 761 టన్నులుగా ఉండగా.. గతేడాది ఆ మొత్తం 802.8 టన్నులకు పెరిగింది. ‘‘2025లో బంగారం గిరాకీ (Gold Demand) 700-800 టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. అయితే, ఈ ఏడాది ధరల్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరగొచ్చు’’ అని డబ్ల్యూజీసీ (WGC) రీజినల్‌ సీఈఓ సచిన్‌ జైన్‌ వెల్లడించారు.

* తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. కిసాన్ అగ్రి షో 2025 (KISAN Agri Show 2025) నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. కిసాన్ అగ్రి షో-2025 మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుండి 9 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన సిద్ధంగా ఉంది. మూడు రోజుల పాటు ఈ భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. 150 పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో వ్యవసాయ ప్రదర్శన మొదటి రెండు ఎడిషన్‌లు విజయవంతమైన నేపథ్యంలో మూడవ ఎడిషన్‌కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌నలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి కిసాన్ అగ్రి షో విలక్షణ వేదికగా నిలవనుంది. వ్యవసాయ రంగంలో విజ్ఞాన మార్పిడికి కేంద్రం కానుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z