Kids

మద్రాస్ ఐఐటీలో వేసవి ఫెలోషిప్-NewsRoundup-Feb 06 2025

మద్రాస్ ఐఐటీలో వేసవి ఫెలోషిప్-NewsRoundup-Feb 06 2025

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి (Dastagiri)ని కడప జైలులో బెదిరించటం, ప్రలోభపెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ను నియమించింది. శుక్రవారం ఉదయం కడప జైలులో దస్తగిరిని విచారణ అధికారి ప్రశ్నించనున్నారు. అనంతరం చైతన్యరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిని విచారణకు పిలవనున్నారు. శుక్రవారం, శనివారం కడప జైలులో విచారణ కొనసాగనుంది.

* దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ-మద్రాస్‌ (IIT Madras) విద్యార్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. వేసవిలో తమ నైపుణ్యాల్ని పెంచుకొనే అవకాశాల కోసం ఎదురుచూసే విద్యార్థుల కోసం సమ్మర్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ అమలు చేస్తోంది. ఇందుకోసం ఔత్సాహిక విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. రెండు నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 28 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. More info – https://www.youtube.com/watch?v=KpDWk-3ENwo

* తెలంగాణ సచివాలయంలోకి నకిలీ తహసీల్దార్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. తిప్పర్తి తహసీల్దార్‌ అని చెప్పి అంజయ్య అనే వ్యక్తి నకిలీ ఐడీ కార్డుతో సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి అడ్డుకున్నారు. తిప్పర్తి ఎంఆర్‌వో కార్యాలయానికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవడంతో అంజయ్య నకిలీ తహసీల్దార్‌ అని తేలింది. ఎస్‌టీఎఫ్‌ ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంజయ్య వచ్చిన వాహనంపై కూడా తహసీల్దార్‌, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అని స్టిక్కర్‌ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు.

* రాష్ట్ర క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మంత్రి మండిపల్లి శ్రీనివాస్‌, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు విజ్ఞప్తితో క్రీడాకారులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.11.68 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రోత్సాహకాలు అందక 224 మంది క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల క్రీడాకారుల సమస్యను శాప్‌ ఛైర్మన్‌.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం చంద్రబాబు 189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు శాప్‌ ఛైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

* కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వరంగల్‌ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను మల్లన్న దగ్ధం చేశారు. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

* వైకాపా(YSRCP)ను వీడిన రాజ్యసభ ఎంపీలపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ (YS Jagan) స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా?అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy) సహా పార్టీ నుంచి వెళ్లిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఇంకా ఒకరో.. అరో వెళ్లిపోయేవాళ్లుంటే వాళ్లకైనా అంతేనని వ్యాఖ్యానించారు. వైకాపా నేడు ఉందంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు. ఇటీవల విజయసాయిరెడ్డి వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్‌ స్పందించారు.

* డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్టు సీఎం చెప్పారు. దస్త్రాలు వేగంగా క్లియర్‌ చేయాలని మంత్రులకు సూచించారు. మంత్రులకు సీఎం చంద్రబాబు కేటాయించిన ర్యాంకులివే..

1. ఎన్‌ఎండీ ఫరూఖ్‌
2. కందుల దుర్గేశ్‌
3. కొండపల్లి శ్రీనివాస్‌
4. నాదెండ్ల మనోహర్‌
5. డోలా బాలవీరాంజనేయస్వామి
6. సీఎం చంద్రబాబు
7. సత్యకుమార్‌
8. నారా లోకేశ్‌
9. బీసీ జనార్థన్‌రెడ్డి
10. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్‌
14. నారాయణ
15. టీజీ భరత్‌
16. ఆనం రామనారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్‌రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్‌
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారథి
24. పయ్యావుల కేశవ్‌
25. వాసంశెట్టి సుభాష్‌

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z