రాజకీయాల్లో హింస, ద్వేషం రెచ్చగొట్టి పావులుగా వాడుకుంటూ సౌధాలు నిర్మించుకుంటున్న వారికి వ్యతిరేకంగా ‘అవే’ సంస్థ ఏర్పడిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ‘అవే’ (Away) 15వ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
అవినీతి తట్టుకోలేక రాజకీయాల్లో ఉండాలా? వద్దా? అని ఆలోచిస్తున్న గొప్పనాయకులు సమాజంలో ఉన్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అవినీతి.. బ్రహ్మ రాక్షసి లాంటిది, ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సన్మాన గ్రహీతల్లో చాలా మంది అవమానాలు ఎదుర్కొని ఉంటారు.. అయినప్పటికీ నిజాయితీగా ఉండటం గొప్ప విషయమన్నారు. ‘‘దేశానికి కావాల్సింది నిజాయితీతో కూడిన మేధావులు. ప్రస్తుతం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా మారి లేదా వారికి డబ్బులు ఇచ్చి అవినీతి చేస్తున్నారు. ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.. కానీ, ఏ రాజకీయ నాయకులూ ముందుకు రారు.
తెలుగు భాష, సంస్కృతికి ప్రాధాన్యత కల్పించాలని తెలుగు మహాసభల్లో కోరితే మాపై అనవసర ప్రచారం చేశారు. తెలుగు భాషను గౌరవించాలి, మాట్లాడాలి. మంచి పని చేయాలంటే అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో నీతివంతుల్ని ఆకర్షించే ప్రయత్నం చేయడం లేదు. పిల్లలకు సామాజిక స్పృహ కల్పించాలి.. సమాజంలో క్లిష్ట పరిస్థితుల్లో బతికేలా నేర్పాలి. వారికి కచ్చితంగా రాజకీయాల గురించి చెప్పాలి. సమాజంలో ప్రశాంతత లేకపోతే మీ ఆస్తులు, జీవితాన్ని అనుభవించలేరు. సోషల్ మీడియాను వాడుకొని రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజలకు ఐదేళ్లకు ఒకసారి అవకాశం వస్తుంది. రాజకీయాల్లో అవినీతి చేస్తే ఉపేక్షించవద్దు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
########
డబ్బులు లేకపోతే ఎన్నికల్లో టికెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు: బుద్ధప్రసాద్
రాజకీయాల్లో ఉండి అవినీతి గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ‘‘ఇవాళ పరిస్థితులు భిన్నంగా తయ్యారయ్యాయి. డబ్బులు లేకపోతే ఎన్నికల్లో టికెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. డబ్బున్నవాడిదే రాజ్యం అయినప్పుడు సామాన్యుడి గురించి ఆలోచిస్తారా? సామాన్యుడు రాజకీయాల్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. సామాన్యుడు కనీసం సర్పంచి అయ్యే పరిస్థితి లేదు. ప్రజా సమస్యల పట్ల ఆలోచించేవారే లేరు. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చారు. ప్రజల్లో మార్పు తేవడానికి ఇలాంటి కార్యక్రమాలూ ఎంతో అవసరం’’ అని బుద్ధప్రసాద్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z