Business

LIC ఆదాయం తగ్గింది. లాభం పెరిగింది-BusinessNews-Feb 07 2025

LIC ఆదాయం తగ్గింది. లాభం పెరిగింది-BusinessNews-Feb 07 2025

* ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,444 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,06,891 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.1,17,017 కోట్లతో పోలిస్తే ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం గమనార్హం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. అందరూ ఊహించినట్లుగా వృద్ధికి ఊతం ఇచ్చేందుకు ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించినప్పటికీ.. ‘తటస్థ’ వైఖరిని కొనసాగించడం, బ్యాంకుల్లో లిక్విడిటీని పెంచేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాల్లో కొనసాగాయి. నిఫ్టీ 23,600 దిగువకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 78,119.60 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 78,058.16) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభం నుంచి ఒడుదొడుకులు ఎదుర్కొంటూ వచ్చింది. ఇంట్రాడేలో 77,475.74 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 197.97 పాయింట్ల నష్టంతో 77,860.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.40 పాయింట్ల నష్టంతో 23,559.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 87.42 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జొమాటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 74.93 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన (Donald Trump).. స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID)లో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండనున్నారట..! మిగతా 9700 మందికి త్వరలోనే ఉద్వాసన పలకనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, దీనిపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

* ఫ్రెషర్ల నియామకాల విషయంలో ఆ మధ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్‌(Infosys) ఎట్టకేలకు గతేడాది వారిని విధుల్లోకి తీసుకుంది. అయితే, ఇందులో కొంతమందికి సంస్థ (Infosys) తాజాగా ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు (Layoffs) ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వరుస ఎవాల్యుయేషన్‌ పరీక్షల్లో విఫలమవడంతో వారిని తొలగించినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ట్రైనీలు (Trainees)గా చేరిన వారిలో సగం మందిపై వేటు పడినట్లు సమాచారం. వరుసగా మూడు ఎవాల్యుయేషన్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారిని తొలగిస్తున్నారట. ట్రైనీలను బ్యాచ్‌ల వారీగా పిలిచి వారితో ‘మ్యూచువల్‌ సెపరేషన్‌’ లెటర్లపై సంతకాలు చేయించుకుంటున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. అయితే, దీనిపై ఇన్ఫోసిస్‌ (Infosys) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

* వందే భారత్‌(Vande Bharat) రైళ్లలో ప్రయాణీకులకు భారతీయ రైల్వే కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఫుడ్‌ ఆప్షన్‌ ఎంచుకోకపోయినా.. ప్రయాణ సమయంలో కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆహారం అందుబాటును బట్టి సిబ్బంది ఆహారాన్ని అందజేస్తారని రైల్వే బోర్డు శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీకి లేఖ రాసింది. టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఫుడ్‌ను ఎంచుకోని వారికి, కరెంట్‌ బుకింగ్‌ ప్రయాణికులకు ఈ సదుపాయం ప్రయోజనకరంగా ఉండనుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z