Movies

ఆఫ్రికా నుండి తెలుగు చిత్రాల పైరసీ-NewsRoundup-Feb 10 2025

ఆఫ్రికా నుండి తెలుగు చిత్రాల పైరసీ-NewsRoundup-Feb 10 2025

* తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో.. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. తితిదే అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.

* అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడితే.. ప్రభుత్వం, మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైకాపా నేతలు అనడం వింతగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకూ కావాలని జగన్‌ అడుగుతున్నారన్న ఆయన.. ఏ రూల్‌ ప్రకారం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం దిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. అసెంబ్లీ హాలులో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలకు నిర్వహించే ఓరియంటేషన్‌కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆహ్వానించారు. అనంతరం అనంతరం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుతో కలిసి అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు.

* ‘‘తండేల్‌’ పైరసీ కాపీ 100శాతం ఓవర్సీస్‌ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్‌ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. అది కూడా గుర్తించాం. క్యూబ్‌లో కోడ్‌ ఉంటుంది. కానీ, పైరసీ కాపీలో ఆ కోడ్‌లేదు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిని గుర్తించే పనిలో ఉన్నాం. ఆఫ్రికన్‌ దేశాల్లో ఉన్న ఐపీ అడ్రస్‌ల నుంచి ప్లే చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. అక్కడ పెద్దగా మనకు సైబర్‌ సపోర్ట్‌ ఉండదు. ఈ విషయంలో నిర్మాతలకు మన ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్‌ చేస్తోంది. పైరసీ చేసిన వాళ్లకి, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. సామాన్య ప్రజలు ఇందులో చిక్కుకోవద్దని కోరుతున్నా. పైరసీ నియంత్రణకు నిర్మాతలందరూ మరోసారి కూర్చొని దీనిపై చర్చించాల్సిన సమయం వచ్చింది’’ అని చిత్ర నిర్మాతలు బన్ని వాసు (Bunny Vasu), సమర్పకులు అల్లు అరవింద్‌ (Allu Aravind) విలేకరుల సమావేశంలో (Thandel Press Meet LIVE) మాట్లాడారు.

* బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌న నిద్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు. త‌న మేన‌ల్లుడు అర్హ‌న్ ఖాన్ నిర్వ‌హించిన డంబ్ బిర్యానీ అనే పాడ్‌కాస్ట్‌లో చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు స‌ల్మాన్ ఖాన్. ఈ పాడ్‌కాస్ట్‌లో భాగంగా స‌ల్మాన్ మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్న‌ప్పుడే ఎక్కువ‌గా నిద్ర‌పోయిన‌ట్లు వెల్ల‌డించాడు. నాకు సాధారణంగా అంద‌రిలాగా నిద్ర‌ప‌ట్టదు. ప‌డుకుంటే గంట‌న్న‌ర లేదా రెండు గంట‌లు అంతే నిద్ర‌పోతాను. ఆపై ఏదో ఒక రోజు నెలకు ఒకసారి, ఏడు గంటలు నిద్రపోతాను. షూటింగ్‌లో టైంలో దొరికిన‌ప్పుడు షాట్ల మ‌ధ్య నిద్ర‌పోతాను. షూటింగ్‌లలో కుర్చీల‌పై ప‌డుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నేను ఎక్కువ‌గా నిద్ర‌పోయిందంటే జైలులో ఉన్న‌ప్పుడే. అక్క‌డ అయితే ఏ ఇబ్బంది లేకుండా 8 గంట‌లు నిద్ర‌పోయేవాడిని. నేను ఏం చేయాల‌నే ప్ర‌దేశాల‌లో ఉన్న‌ప్పుడు నిద్ర మాత్రమే పోతాను అంటూ చెప్పుకోచ్చాడు.

* దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలివుల్లా ఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర విమర్శించారు. ట్రంప్ భారతీయులపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ లో ట్రంప్ ఫ్లెక్సీని దహనం చేశారు. చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రంప్ నిర్ణయాల వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారత పౌరుల హక్కులను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 104 మంది భారతీయ పౌరులను అమెరికా నుంచి బహిష్కరించడాన్ని తాము త్రీవంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని విమర్శించారు. గౌరవంగా పంపించకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను అవమానించడం సరైన విధానం కాదన్నారు. పెట్టుబడిదారీ రాజ్యానికి దేశ ప్రతిష్టతను మోదీ తాకట్టు పెట్టడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అమెరికా అధికారులతో చర్చలు జరిపి భారతీయుల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

* రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్‌, ధర్నా చౌక్‌ వద్ద ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇచ్చింది ఏముంది.. చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలు ఎవరు వచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తడు అంటడు అని.. 15 నెలలు అయినా ఎవరికీ కలువలేదన్నారు. కోడంగల్ వాళ్లను కూడా రానివ్వని పరిస్థితి నెలకొందన్నారు. మీ సత్తా చూపే సమయం వచ్చిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కలిసి ఉండాలని.. విడిపోయి ఉండొద్దన్నారు. అప్పుడే బలం ఉంటుందన్నారు.

* మార్గదర్శి స్కామ్‌ దేశంలోనే చాలా పెద్ద స్కామ్‌ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్‌రెడ్డి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్‌ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.

* ఏడాదిగా కొడంగల్‌లో దుర్యోధనుడి పాలన సాగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.సోమవారం(ఫిబ్రవరి10) కోస్గిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ‘రైతుదీక్ష’లో కేటీఆర్‌ మాట్లాడారు.‘ఇక్కడ కురుక్షేత్ర యుద్దం సాగుతోంది. 14 నెలలుగా రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నాడు. అల్లుడికి కట్నం కోసం లగచర్ల భూములు గుంజుకున్నాడు. కుట్రతో అదానీకి,తన అల్లుడి కంపెనీకి భూములు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయించారు.లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ ఢిల్లీలో పోరాడింది. గిరిజనులు తలచుకుంటే రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో మళ్లీ గెలవడు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామాచేసి కొడంగల్‌లో పోటీ చేసి గెలువు.ఇక్కడ మా పార్టీ అభ్యర్దికి 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా’అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z