Business

ట్రంప్ ప్రభావం. ఆగని భారత స్టాక్ మార్కెట్ పతనం-BusinessNews-Feb 10 2025

ట్రంప్ ప్రభావం. ఆగని భారత స్టాక్ మార్కెట్ పతనం-BusinessNews-Feb 10 2025

* సెన్సెక్స్‌ ఉదయం 77,789.30 (క్రితం ముగింపు 77,860.19) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 77,106.89 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ ఒక పైసా మేర బలపడి 87.49 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, జొమాటో, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం దూసుకెళుతోంది. ఔన్సు 2929.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* పేటీఎం (Paytm) బ్రాండ్‌పై సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ డిజిటల్‌.. ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ అగోడాతో (Agoda) జట్టు కట్టింది. ఇందులోభాగంగా పేటీఎం యాప్‌లో హోటల్‌ బుకింగ్‌ సేవలను అందించనుంది. ఇప్పటికే పేటీఎం ట్రావెల్‌ ద్వారా విమాన, బస్‌, ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా తన సేవలను మరింత విస్తరిస్తోంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని హోటళ్లు బుకింగ్‌ ఆప్షన్‌ను తన యాప్‌ ద్వారా అందించనుంది.

* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ (Swiggy) ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయి. అనంతరం కొన్ని బ్రోకరేజీ సంస్థలు దీని రేటింగ్‌ను తగ్గించాయి. దీంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఈ కంపెనీ షేర్లు వరుసగా పతనమవుతున్నాయి. సోమవారం కూడా స్విగ్గీ షేర్లు కుదేలయ్యాయి. దీంతో ఇప్పటివరకు కంపెనీ మార్కెట్‌ విలువ ఏకంగా రూ.40,250 కోట్ల మేర తగ్గడం గమనార్హం. సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్విగ్గీ షేర్లు (Swiggy Shares) ఒక దశలో 6 శాతానికి పైగా కుంగిపోయాయి. బీఎస్‌ఈలో షేరు ధర రూ.359 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. గత కొన్ని రోజులుగా స్విగ్గీ షేర్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. ఇష్యూ ధర రూ.390 కంటే దిగువకు పడిపోయాయి. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు కంపెనీ తన మార్కెట్‌ విలువలో ఏకంగా రూ.40,235 కోట్ల సంపదను కోల్పోయింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో స్విగ్గీ షేర్లు విలువ 4.64శాతం తగ్గి రూ.363.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటు బీఎస్‌ఈలో 4.61శాతం దిగజారి రూ.363.45గా కొనసాగుతోంది.

* దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరాల్లో నివాసం ఉండటానికి సెలబ్రిటీలు.. రాజకీయ, ఆర్థిక, సినిమా, వాణిజ్య రంగ ప్రముఖులు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక కార్పొరేట్‌ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు మెరుగైన వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండటానికే మొగ్గు చూపుతుంటారు. అందుకే ఢిల్లీ, ముంబై నగరాల్లో లగ్జరీ ఇండ్ల ధరలకు రెక్కలొచ్చేస్తున్నాయి. 44 ప్రధాన అంతర్జాతీయ నగరాలతో పోలిస్తే లగ్జరీ ఇండ్ల ధరల్లో న్యూఢిల్లీ ఆరో స్థానం, ముంబై ఏడో స్థానంలో నిలిచాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్ తెలిపింది. 2023-24తో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సగటున ఇండ్ల ధరలు 6.7 శాతం పెరిగాయి. గత డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల ఇండ్ల ధరలను విశ్లేషిస్తూ నైట్‌ ఫ్రాంక్ ‘ప్రైమ్ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ4 2024’ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది. స్థానిక కరెన్సీ ధరలతో పోలుస్తూ నైట్‌ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రపంచ దేశాల్లోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ మొదటి స్థానంలో నిలుస్తుంది. సియోల్‌లో ఇండ్ల ధరలు 18.4 శాతం పెరిగితే, మనీలాలో 17.9 శాతం, దుబాయిలో 16.9, టోక్యోలో 12.7, నైరోబీలో 8.3 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో న్యూఢిల్లీలో ఇండ్ల ధరలు ఇంప్రెసివ్‌గా 6.7 శాతం పెరిగాయి. లైఫ్‌ స్టైల్‌ మెరుగు పడటంతోపాటు ఆర్థికంగా బలోపేతం కావడం దీనికి కారణం. అంతకుముందు అక్టోబర్‌ త్రైమాసికంలో 16వ స్థానంలో నిలిచిన ఢిల్లీ.. డిసెంబర్ త్రైమాసికానికి ఆరో స్థానానికి దూసుకెళ్లడం ఆసక్తికర పరిణామం.

* ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) దేశీయ మార్కెట్‌లో త్వరలో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారు ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతుంది. హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ (Hyundai Creta Electric) కారుకు పోటీగా మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన బీఈ 6 (BE6) కారును ఆవిష్కరించనున్నది. డ్రైవింగ్‌ అవసరాలు, వేర్వేరు ప్రాధాన్యాలకు అనుగుణంగా వెరైటీ వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రతి వేరియంట్ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, బ్లెండింగ్‌ పెర్ఫార్మెన్స్‌, టెక్నాలజీ, డిజైన్‌, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. మార్కెట్‌లో ఆవిష్కరించిన తర్వాత దశల వారీగా కార్ల డెలివరీ ప్రారంభం కానున్నది.

బీఈ6 (BE6) వేరియంట్ల వారీ ధరవరలు ఇలా :
వేరియంట్‌ – బ్యాటరీ ప్యాక్‌ – ధర
పాక్‌ వన్‌ – 59కిలోవాట్లు – రూ.18.90 లక్షలు
పాక్ వన్‌ ఎబౌవ్‌ – 59కిలోవాట్లు – రూ.20.50 లక్షలు
పాక్ టూ – 59 కిలోవాట్లు – రూ. 21.90 లక్షలు
పాక్ త్రీ సెలెక్ట్‌ – 59 కిలోవాట్లు – రూ. 24.50 లక్షలు
పాక్‌ త్రీ – 59కిలోవాట్లు – రూ. 26.90 లక్షలు

* కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తదితర అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఫోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిధుల ఉపసంహరణ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.7,300 కోట్ల (840 మిలియన్‌ డాలర్లు) విలువైన పెట్టుబడులను ఉపసంహరించారు. జనవరిలో రూ.78,027 కోట్ల విలువైన వాటాల ఉపసంహరణకు కొనసాగింపుగా ఈ నెల ఏడో తేదీ వరకూ రూ.7,342 కోట్ల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించారు. డిసెంబర్‌ నెలలో రూ.15,446 కోట్ల విలువైన ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ సూక్ష్మ, ఆర్థిక పరిణామాలు, దేశీయ ప్రభుత్వ విధానాలను బట్టి మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ఉంటుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్‌ సుంకాలు విధించడంతో ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ గత వారం రూ.87 కంటే దిగువకు పడిపోయి.. జీవిత కాల కనిష్ట స్థాయికి పరిమితమైంది. ఫలితంగా యూఎస్‌ బాండ్ల విలువ పెరుగుదల, డాలర్‌ విలువ బలోపేతం కావడంతో ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణకు మరో కారణం అని చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z