DailyDose

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు-NewsRoundup-Feb 16 2025

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు-NewsRoundup-Feb 16 2025

* మనీ లాండరింగ్‌ కేసులో మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ అరెస్టయ్యారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్‌.. ప్రవింద్‌తో పాటు ఆయన సతీమణి కోబితాను గంటలపాటు విచారించింది. అనంతరం ప్రవింద్‌ను అరెస్టు చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. సెంట్రల్‌ మారిషస్‌లోని మెకాలో ఉన్న నిర్బంధ కేంద్రంలో ఆయన్ను ఉంచినట్లు తెలిపింది.

* జౌళి ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. ఈ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్ల లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దిల్లీలో ఫిబ్రవరి 14 నుంచి 17వరకు జరుగుతున్న భారత్‌ టెక్స్‌ కార్యక్రమానికి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. టెక్స్‌టైల్‌ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, తద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉన్న భారత్‌.. గతేడాది 7శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ప్రస్తుతం రూ.3లక్షల కోట్లుగా వార్షిక ఎగుమతుల్ని 2030 నాటికి రూ.9లక్షల కోట్లకు పెంచడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. భారత్‌ టెక్స్‌ 2025లో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయన్నారు.

* దిల్లీ నూతన ముఖ్యమంత్రి (Delhi CM) ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు శాసనసభా పక్షం సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ కార్యదర్శులు కూడా పాల్గొనే ఈ సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

* భారాస పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రమేనని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈమేరకు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ రాశారు.

* ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్‌-బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ సాయంత్రం కన్నుమూసింది. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రమణ యశస్వి ధ్రువీకరించారు.

* తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర.. సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి(Hyderabad-Vijayawada National Highway)పై ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నుంచి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చే వాహనాలు కోదాడ వద్ద మళ్లిస్తున్నారు. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలన బీబీగూడెం మీదుగా మళ్లిస్తున్నారు.

* అధికారులు ఎంత నిబద్ధత చూపితే పథకాలు అంత విజయవంతమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్‌ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్‌ ఆఫ్‌ ఏ సివిల్‌ సర్వెంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదన్నారు. కానీ, ఇప్పటి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని, ఏసీ గదులను వీడేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు.

* రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు.డొనాల్డ్‌ ట్రంప్‌,పుతిన్‌ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్‌ చర్చలపై జెలెన్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.అమెరికా మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువ అని జెలెన్‌స్కీ అన్నారు. తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని చెప్పారు.ఇంతేకాక రష్యాతో యూరప్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. యూరప్‌ ఇప్పటికైనా మేల్కొని,సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో యూరప్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.మరోవైపు రష్యాతో ట్రంప్‌ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్‌ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్‌ రష్‌కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.

* మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహాకుంభమేళాకు అసలేమైనా అర్థం..పర్థం ఉందా..?అది ఓ అర్థం లేని వ్యవహారం’ అని లాలూ అన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని వ్యాఖ్యానించే సందర్భంలో లాలూ మహా కుంభమేళాపై ఈ వ్యాఖ్యలు చేశారు.

* ఈ నెల 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోని సత్రాల నిర్వాహకులతో శ్రీశైలం సీఐ ప్రసాదరావు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సత్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సత్రాల నిర్వాహకులకు చెప్పారు. సత్రాలు వారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కువ మొత్తం డిమాండ్ చేయరాదని హెచ్చరించారు. సత్రాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జూదం, మద్యం తాగడం, మాంసం తినడం చేయకూడదని శ్రీశైలం సీఐ ప్రసాదరావు చెప్పారు. సత్రాల్లో వేరే రాష్ట్రాల వ్యక్తుల పనిచేస్తే వారి పూర్వపరాలు, తనిఖీ చేసుకోవాలని సత్రాల నిర్వహాకులకు సూచించారు. అలాగే సత్రాల్లో రూమ్‌ చార్జీల పట్టిక డిస్‌ప్లే చేయాలన్నారు.. దేవస్థానం పరిసరాల్లో చేయతగిన పనులు, చేయకూడని పనులు తెలియచేస్తూ డిస్‌ప్లే ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. సత్రాల్లో దళారీ వ్యవస్థ ఉండకూడదని, సత్రాల్లో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదని, సత్రాల్లో ఎలాంటి గొడవలు జరిగినా సత్రాల నిర్వాహకులదే బాధ్యత అని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z