* ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys)ల మధ్య పోరు కొనసాగుతోంది. యూఎస్‌లో ఓ దావాపై ఈ ఇరు సంస్థలు గత కొంతకాలంగా పోరాడుతున్నాయి. ఈనేపథ్యంలో ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ పెద్దఎత్తున ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుంచి వాణిజ్య రహస్యాలని ఇన్ఫీ దొంగిలించిందని విమర్శించింది. ఈవిషయాన్ని ఉటంకిస్తూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ (NDAAs) ద్వారా ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందంటూ కాగ్నిజెంట్ ఆరోపించింది. అంతేకాదు ఈవిషయంపై ఆడిట్ చేసేందుకు ఆ కంపెనీ నిరాకరించిందని కాగ్నిజెంట్ తెలిపింది. హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుంచి వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపించిన కాగ్నిజెంట్ 2024 ఆగస్టులో అమెరికా కోర్టులో దావా వేసింది. ఈ ఆరోపణల్ని ఇన్ఫోసిస్ తిరస్కరించింది. కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ బహిరంగంగా ఉన్నాయని తెలిపింది. అంతేకాదు.. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో ఉన్న రవికుమార్.. తమవద్ద పనిచేసిన సమయంలో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విడుదల చేయడాన్ని ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్ ప్రత్యారోపణలు చేసింది. కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం ఆయన చర్చలు జరిపారని పేర్కొంది.
* లండన్ నుంచి రూ.వందల కోట్ల విలువైన బంగారం (Gold) తరలిపోతోంది. అదంతా అమెరికా బ్యాంకుల్లో పోగవుతోంది. ఐరోపా దేశాలపైనా సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో టన్నుల కొద్దీ పుత్తడి రవాణా అవుతోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. బంగారంపై కూడా టారిఫ్‌లు విధించొచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. ఇవన్నీ లోహ పరిశ్రమలో ఒత్తిడికి దారితీశాయి. దాంతో లండన్‌లో బంగారం విలువ పతనమవుతుండగా.. న్యూయార్క్‌లో మాత్రం ధర ఆకాశన్నంటుతుంది. ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో లండన్‌లో 20 డాలర్ల మేర క్షీణించింది. మరోవైపు అమెరికాలో ఔన్సు బంగారం 3000 డాలర్లకు చేరువవుతోంది. ఈ పరిణామాలతో అమెరికా దిగ్గజ బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. జేపీ మోర్గాన్ చేజ్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రధాన బ్యాంకులు.. లండన్‌లో వాల్ట్‌ల నుంచి తమ పసిడి నిల్వలను శరవేగంగా విమానాల్లో స్వదేశానికి తెచ్చుకుంటున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 75,531 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. కానీ చివరికి 29 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,967 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 22,801 కనిష్ట స్థాయిని, 22,992 గరిష్ట స్థాయిని తాకి, ఆ తర్వాత 14 పాయింట్లు తగ్గి 22,945 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3 శాతం వరకు లాభపడి టాప్ పెర్ఫార్మర్‌లలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, జొమాటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇతర స్పష్టమైన కదలికలు చేశాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా & మహీంద్రా, టీసీఎస్ ఒక్కొక్కటి 1 – 2 శాతం క్షీణించాయి. విస్తృత మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా ఫ్లాట్ నోట్‌తో ముగిసింది. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5 శాతం క్షీణించింది. మొత్తంగా ఈరోజు మార్కెట్ 3:1 నిష్పత్తిలో బేర్‌లకు అనుకూలంగా నష్టాలను చూసింది. బీఎస్‌ఈలో దాదాపు 3,000 స్టాక్‌లు క్షీణించగా, 1,000 కంటే తక్కువ షేర్లు లాభపడ్డాయి.
* ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రోజుకొక రికార్డు స్థాయికి చేరిన పుత్తడి సోమవారం రూ.89 వేల దిగువకు పడిపోయింది. అధిక ధరల కారణంగా కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 తగ్గి రూ. 88,200కి దిగొచ్చింది. ధరలు తగ్గకముందు ఇది రూ.89,400గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా రూ.1,200 దిగి రూ.89 వేల నుంచి రూ.87,800గా నమోదైంది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,200 తగ్గి రూ.87,800గా నమోదైంది. అయినప్పటికీ ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ నెల డెలివరీకిగాను తులం ధర రూ.431 అధికమై రూ.85,118కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,911.95 డాలర్లు పలుకగా, వెండి 32.89 డాలర్ల వద్ద ఉన్నది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z