* గ్రూప్-2 పరీక్షల (Group- 2 exams)వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల అంశాలపై సీఎం చంద్రబాబు శనివారం పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు.. గ్రూప్-2 అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన మా దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించాం. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ(APPSC)కి లేఖ రాశాం. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతం’’అని సీఎం వివరించారు.
* ఫిబ్రవరి 23న (ఆదివారం) జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ సూచించింది.
* అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైకాపా అధినేత జగన్ నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి శాసనసభకు హాజరుపై జగన్ ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం. శాసనసభకు, బడ్జెట్ సమావేశాలకు రావడంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
* యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధురకవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహా సంప్రోక్షణకు 40 జీవ నదుల జలాలు సేకరించారు. ఆదివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా గుట్ట కింద సత్రాల్లో లక్ష మందికి ఉచిత పులిహోర ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. గుత్తేదార్లతో కుమ్మక్కై, కమీషన్ల వేటలో పర్యవేక్షణ గాలికి వదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. చిక్కుకుపోయిన కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు.. వారి హయాంలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై ఏమంటారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంలో గుత్తేదారును కాపాడేందుకు వాస్తవాలు దాచి పెట్టిన ప్రభుత్వం.. కనీసం ఎస్ఎల్‌బీసీ ఘటనలో పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
* బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన విషయంలో భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ దాదాపు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
* బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ (Farah Khan) పై కేసు నమోదు అయింది. హోలీ పండుగను ఉద్దేశించి ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు మత విశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా ఒక వర్గాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని పేర్కొంటూ వికాశ్ అనే వ్యక్తి ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె వ్యాఖ్యలు తనని ఎంతగానో బాధించాయన్నాడు. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. ఈ విషయంపై వికాశ్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పవిత్రమైన పండుగ గురించి ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు.
* ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్పిపల్ సెక్రటరీ-2గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. శక్తికాంత్ దాస్.. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక‍్రటరీ2గా నియమించడానికి క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది., ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DoPT) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాతా ఉత్తర్వులు ప్రకారం ప్రధాని మోదీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ శక్తికాంత్ దాస్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే పికె మిశ్రా సెప్టెంబర్ 11, 2019 నుండి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు.2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా వైదొలిన క్రమంలో ఆ బాధ్యతల్ని శక్తికాంత్ దాస్ చేపట్టారు. 1980 తమిళనాడు క్యాడర్ కు ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్.. ఢిల్లీ సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం బర్మింగమ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ పూర్తి చేశారు. 2016లో మోదీ ప్రభుత్వం ‘ పెద్ద నోట్ల రద్దు’ చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన ఎకానామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు.
* తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాల సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోదీకి రేవంత్ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. మంత్రులు ఉత్తమ్, మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం రేవంత్ వివరించారు. సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గంటల ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు , జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కుకున్నవారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
* చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తప్పును అంగీకరించిన ఐసీసీ.. రాబోయే మ్యాచ్‌ల సమయంలో పాకిస్థాన్ పేరుతో మూడులైన్ల లోగోను ఉపయోగించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది.
* మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భద్రతా ఏర్పాట్లను నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు పరిశీలించారు. శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్స్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు, టాయిలెట్స్ ఇలా కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు సమయమనం పాటిస్తూ ఎలాంటి తొక్కిసలాటకు తావు లేకుండా దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే మందులు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
* అంతర్ రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్నాయి. శనివారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలపళ్ల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు జరిగాయి. పోటీలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 జతల వృషభరాజములు తరలొచ్చాయి. పోటీలను అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, బహుమతుల దాత, శ్రీరామ ట్రేడర్స్ అధినేత యుగంధర్ రెడ్డిలు ప్రారంభించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z