* కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఆగమశాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రకటన చేయాలని అభ్యర్థించారు. ‘‘తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు.. ముఖ్యంగా హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోంది. తిరుమల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో-ఫ్లైజోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుంది’’ అని తితిదే ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ లేఖపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సానుకూలంగా స్పందించారు.
* తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైకాపా నేత, నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్.. తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్‌ను హెచ్చరిస్తున్నా. నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదు. ఇక్కడ ఉన్నది వైకాపా ప్రభుత్వం కాదు.. కూటమి ప్రభుత్వం. ఏది పడితే అది మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. రెడ్ బుక్ ప్రకారం మేం ముందుకెళ్తే వైకాపా నేతలెవరూ రోడ్లపై తిరగలేరు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. అలా అని తప్పు చేసిన వాళ్లని ఉపేక్షించేది లేదు. చేసిన తప్పులకు శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా…. అనుభవించేది ఆయనే.
* అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో ఉన్న సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపై రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. కడుపు నొప్పి అని పోసాని డ్రామా ఆడారని సీఐ తెలిపారు. ‘‘పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించాం. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు’.. అని సీఐ చెప్పారు. అందుకే పోసానిని తిరిగి రాజంపేట సబ్‌జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
* మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని.. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే సూచనలున్నాయని తెలిపింది. 125 సంవత్సరాల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని పేర్కొంది.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలోని వెంజరమూడు ఘటనలో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రేయసి సహా నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఉదంతంలో కీలక విషయాలను తాజాగా పోలీసులు బయటపెట్టారు. రూ.65 లక్షల అప్పే ఈ హత్యకు అఫాన్‌ను పురిగొల్పిందని తెలిపారు. అంతేకాదు వరుస హత్యలకు పాల్పడిన నిందితుడు.. వాస్తవానికి ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. వెంజరమూడుకు చెందిన అఫాన్ (23) కుటుంబానికి దాదాపు రూ.65 లక్షల అప్పు ఉంది. 14 మంది ప్రైవేటు వ్యక్తులు తరచూ అప్పు తిరిగి చెల్లించాలంటూ వేధిస్తుండేవారు. అఫాన్ తండ్రి సౌదీలో ఉండేవాడు. స్థానికంగా అప్పుల వాళ్ల ఒత్తిడిన అఫాన్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో బాబాయ్, పిన్ని, నాన్నమ్మ ఏమాత్రం సాయం చేయకపోవడంతో వారిపై పగ పెంచుకున్నాడు. అప్పుల వారి ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్యే శరణ్యం అని నిర్ణయించుకున్నాడు. తల్లి, సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రతిపాదిస్తే అందుకు తల్లి నిరాకరించడంతో హత్యలకు ప్రణాళిక రచించాడు. తల్లిని, సోదరుడిని చంపేసి తర్వాత తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అందుకే తొలుత అఫాన్.. తల్లిపై దాడి చేసి ఆమె చనిపోయిందని భావించి నాన్నమ్మ ఇంటికెళ్లాడు. ఆపై ఆమెను చంపేసి ఆమె దగ్గర బంగారం గొలుసును అపహరించాడు. ఆపై బాబాయ్, పిన్ని ఇంటికెళ్లిన అఫాన్ వారినీ హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఇంట్లో ఉన్న 13 ఏళ్ల తమ్ముడిని, తన ప్రేయసి ఫర్సానానూ అంతమొందించాడు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరైపోతుందన్న ఉద్దేశంతో తన కుటుంబంతో సంబంధం లేకపోయినా ప్రియురాలిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
* బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నె ఖాన్ తో విడాకుల వ్యవహారం ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే హృతిక్ రోషన్ సుసాన్నె ఖాన్ 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2014లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్ కి భరణంగా దాదాపుగా రూ.380 కోట్లు చెల్లించాడట.. అంతేకాదు వీరికి జన్మించిన హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ సంరక్షణ బాధ్యతలు కూడా హృతిక్ రోషన్ చూసుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఇటీవలే ఓ స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకోగా భరణం రోపంలో తన మాజీ భర్యకి దాదాపుగా రూ.60 కోట్లు పైగా చెల్లించాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటివరకూ బాలీవుడ్ లో హైయ్యెస్ట్ భరణం అందుకున్నది ఎవరనే విషయంలో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నె ఖాన్ ట్రెండ్ అవుతున్నారు.
* దేశంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసం ఆదివారం(మార్చి 2) నుండి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో మతపెద్దలు ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ సందడిగా మారింది. రేపటి నుండి పవిత్ర మాసం ప్రారంభం కానుండటంతో, హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లోని వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాసాలను పాటిస్తారు. సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు నీరు కూడా తాగరు.
* పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మద్ధతు ధర ప్రకటిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్వర్వులు జారీ చేశారు. పామాయిల్ రైతులను ప్రోత్సహిస్తామని, అన్ని విధాల ప్రభుత్వం సహాయం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. పామాయిల్ పంటకు మద్ధతు ధర ఖరారు చేసినట్లు తెలిపిన మంత్రి.. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. పామాయిల్ టన్నుకు 20 వేల 871 రూపాయల మద్ధతు ధర ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పామాయిల్ పంటను అధికంగా పండించాలని, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేలా పామాయిల్ ఉత్పత్తి జరగాలని మంత్రి పిలుపునిచ్చారు. అందుకోసం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు.
* అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్, బుచ్ విల్మోర్‌ల రాకకోపం ఎదురుచూస్తున్నవారికి అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిష్ట్రేషన్(నాసా) శుభవార్త చెప్పింది. వీరు అంతరిక్షం నుంచి 2025, మార్చి చివరిలో భూమికి తిరిగి రానున్నట్లు వెల్లడించింది. సాంకేతిక ఇబ్బందులు, మిషన్ రీషెడ్యూలింగ్ కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం క్రూ-10 మిషన్ మార్చి 12న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు బయలుదేరుతుంది. ఈ మిషన్‌లో అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్ (నాసా), టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ), కిరిల్ పెస్కోవ్ (రోస్కోస్మోస్) ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక, క్రూ-9 మిషన్ (సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కూడినది) భూమికి తిరిగి వస్తుంది. క్రూ-10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుందని, ఒక వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉంటుందని బుచ్ విల్మోర్ తెలిపారు. దీని తరువాత ఆ వ్యోమగాములు మార్చి 19 నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. నాసా, స్పేస్‌ఎక్స్‌లు ఈ మిషన్‌ను వేగవంతం చేశాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z