Kids

CA పరీక్షల్లో టాపర్లుగా తెలుగు విద్యార్థులు-NewsRoundup-Mar 04 2025

CA పరీక్షల్లో టాపర్లుగా తెలుగు విద్యార్థులు-NewsRoundup-Mar 04 2025

* ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్‌ యూనిఫామ్‌ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్‌ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టాక మరోసారి రష్యాతో సంబంధాలపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఆయన తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వేగంగా ముగించడం కోసం పుతిన్‌తో చర్చలు జరపడం.. జెలెన్‌స్కీపై ఒత్తిడి పెంచడం వంటివి చోటు చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం నుంచి పలు మీడియా సంస్థల్లో ట్రంప్‌ ఒకప్పుడు కేజీబీ గూఢచారి అని ఓ మాజీ సోవియట్‌ అధికారి పోస్టును ఉటంకిస్తూ వార్తలు రాస్తున్నాయి. ఇలా ప్రచారంలో ఉన్నవాటిని ప్రస్తావిస్తూ మిర్రర్‌ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో పుతిన్‌ను విమర్శించేందుకు ఆయన అంగీకరించకపోవడం, ఐరోపా మిత్రదేశాలను దూరం చేసుకోవడం వంటివి ఈ ప్రచారాలకు ఆజ్యం పోస్తున్నాయి.

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) సీఏ ఇంటర్‌, ఫౌండేషన్‌ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌. జనవరిలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ICAI మంగళవారం విడుదల చేసింది. విద్యార్థులు https://icai.nic.in/ వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వంటి వివరాలను ఎంటర్‌ చేసి స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను పొందొచ్చు. ఇక, సీఏ ఇంటర్‌ (ICAI CA Inter Results 2025) పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షి అగర్వాల్‌ 86.63శాతం మార్కులతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. విజయవాడకు చెందిన తోట సోమనాధ్‌ శేషాద్రి నాయుడు 86శాతం స్కోరుతో రెండో ర్యాంక్‌ దక్కించుకున్నాడు. హాథ్రస్‌ (యూపీ)కి చెందిన సర్థాక్‌ అగర్వాల్‌ 85.83శాతం మార్కులతో మూడో ర్యాంక్‌లో నిలిచాడు.

* ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతనిపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు. ‘‘గతంలో బిహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. నీవు చిన్నపిల్లాడివి. వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నా వల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ.. మద్దతు ఇచ్చా’ అని నీతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

* ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలపై అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది. ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థ సారథితో బ్యాంకు ప్రతినిధులు .. రుణం మంజూరు చేస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలపై చర్చించారు.

* ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంలో అమెరికా, ఐరోపా సమాఖ్య మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇదే అదునుగా భావించిన చైనా (China).. ఈయూ (EU)తో తన సంబంధాలను మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అగ్రరాజ్యం తీసుకుంటున్న ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా ఈయూతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా పార్లమెంటు (NPC) ప్రతినిధి లౌ కిన్‌జియాన్‌ మంగళవారం పేర్కొన్నారు. ‘‘గత 50 ఏళ్లుగా చైనా, యూరప్ మధ్య ఎటువంటి ఘర్షణలు లేవు. ఇరు వర్గాలు అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. చైనా ఉత్పత్తులకు, ఇక్కడ రూపొందించే ఏఐ (AI) అనుకూల ఇ-వాహనాల బ్యాటరీలకు ఈయూ దేశాలు లాభదాయకమైన మార్కెట్‌గా ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలతో సంబంధాలు మరింత పెంచుకోవడానికి ఆసక్తితో ఉన్నాం’’ అని లౌ కిన్‌జియాన్‌ పేర్కొన్నారు. చైనా-యూరప్ సంబంధాలు ఏ మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవని.. వాటిపై ఆధారపడి ఉండవని పరోక్షంగా అమెరికా ఐరోపా దేశాల సంబంధాలను ఉద్దేశించి అన్నారు.

* ఎంత క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్‌ వచ్చిందనేది అందరూ గుర్తించారు. కానీ, అసెంబ్లీకి రాని శాసనసభ్యులు మాత్రం బయట ఉండి విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు. కొందరు సభకు రాకుండా ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేసిన పాపాలు వెంటాడటం వల్లే వారు అసెంబ్లీకి రాలేకపోతున్నారేమోనన్నారు.

* ఐదేళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నేతలు ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, తెదేపా మహిళా నేత సుధారెడ్డి (Pulivarthi Sudha Reddy) విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. తాను లంచాలు తీసుకున్నట్లు వైకాపా నేతలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రగిరిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సుధారెడ్డి మాట్లాడారు.

* ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z