Politics

ప్రతీకారం తీర్చుకోవాలని భాజపా భావిస్తోంది – NewsRoundup – Mar 07 2025

ప్రతీకారం తీర్చుకోవాలని భాజపా భావిస్తోంది – NewsRoundup – Mar 07 2025

* మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఓ ఇంటర్వ్యూ రాబోతోంది. కుమార్తెలు విజయదుర్గ, మాధవితో కలిసి అంజనమ్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో చిరంజీవి, నాగబాబు కూడా పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ఈ రోజు విడుదలైంది.

* హాలీవుడ్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra Jonas). ప్రస్తుతం మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న #SSMB29లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె గత కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ముంబయిలో ఆమెకు చెందిన అత్యంత విలాసవంతమైన కొన్ని ఫ్లాట్‌లను విక్రయించినట్లు ఇండెక్స్‌ ట్యాప్‌ తెలిపింది. వెస్ట్‌ ముంబయి అంథేరిలో ఉన్న ఒబెరాయ్‌ స్కై గార్డెన్స్‌లోని ఫ్లాట్‌లకు డిమాండ్‌ బాగా ఉంది. అంతేకాదు, అవి అత్యంత ఖరీదైనవి కూడా కావడం గమనార్హం. అక్కడ ప్రియాంకకు అత్యంత విలాసవంతమైన జోడీ యూనిట్‌ సహా నాలుగు ఫ్లాట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని రూ.16.17 కోట్లకు విక్రయించారు. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్‌ ఉండగా, వాటిని రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు విక్రయించారు. ఇక 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్‌ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేశారట. మార్చి 3వ తేదీన ఇందుకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

* డీలిమిటేషన్‌ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని విమర్శించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో రేవంత్‌ రెడ్డి శుక్రవారం మాట్లాడారు. ‘‘దక్షిణాదిలో భాజపాకు తగిన ప్రాతినిధ్యం లేదు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆ పార్టీ సాధించిన 240లో దక్షిణాదిలో గెలిచింది కేవలం 29 స్థానాలే. దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో లేదు. ఏపీలో జూనియర్‌ భాగస్వామిగా ఉంది. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని భాజపా భావిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా డీలిమిటేషన్‌కు సిద్ధమవుతోంది’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

* పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై తెదేపా (TDP)అధిష్ఠానం సీరియస్‌ అయింది. గురువారం ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో చదలవాడ హల్‌చల్‌ చేశారు. ఆయన వ్యవహరించిన తీరు సరికాదని పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని తెదేపా కేంద్ర కార్యాలయం ఆదేశించింది.

* ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా భారాస రజతోత్సవ వేడుకలు ఉండాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 27న లక్షలాది మందితో వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. పలు కీలక అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ రజతోత్సవాలు, సంస్థాగత అంశాలు, భారాస సభ్యత్వ నమోదు, సంబంధిత అంశాలపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

డీపీవోల కేడర్‌ క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలకు ఆమోదం
డీపీవోలు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పులపై కేబినెట్‌ నిర్ణయం
పౌరసేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్‌లో మార్పులకు ఆమోదం
ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు ఆమోదం
కుప్పం నియోజకవర్గంలో డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం
వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
372 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనకు ఆమోదం
సీతంపేటలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ఉచిత భూ కేటాయింపునకు ఆమోదం
రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ఉచిత భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
రాజమహేంద్రవరం పాత రైల్వే హ్యావలాక్‌ బ్రిడ్జి అభివృద్ధికి 116 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 షాపులు కేటాయింపునకు ఆమోదం
2024-29 టూరిజం ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం

* తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల వెల్లడికి రూపొందించిన షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 18 మధ్య గ్రూప్‌-1, 2, 3 ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 10న గ్రూప్‌-1 ఫలితాలు వెల్లడించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది.

* బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌తోపాటు యూరప్, అమెరికా, మధ్యప్రాచ్యానికి ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. పలుమార్లు భర్త జతిన్ హుక్కేరి కూడా నటి వెంట వెళ్లినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. మరోవైపు.. నటి సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు..ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.

* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

* తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin) డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్‌ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటుకు కసరత్తు చేపట్టారు. దీని కోసం ఏడు రాష్ట్రాల సీఎంలను చెన్నైకు ఆహ్వానించారు. దక్షిణాదిలోని కర్ణాటక, కేరళ, ఆంధ్రా, తెలంగాణాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. డీలిమిటేషన్ కసరత్తుకు ప్రణాళిక కోసం జేఏసీ ఏర్పాటుకు పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z