WorldWonders

బ్యాంక్ మన్ను కోసం ఎగబడుతున్న చైనీయులు-NewsRoundup-Mar 11 2025

బ్యాంక్ మన్ను కోసం ఎగబడుతున్న చైనీయులు-NewsRoundup-Mar 11 2025

* పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని వేర్పాటువాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు (Jaffar Express Train Hijacked in Pakistan). వందల మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలోచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై వేర్పాటువాదులు భారీస్థాయిలో కాల్పులు జరిపారని బలోచిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్‌ రిండ్‌ వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్‌ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్నవారిలో భద్రతాసిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. పక్కా ప్లానింగ్‌తో ఆ గ్రూప్‌ రైల్వేట్రాక్‌ను పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దాంతో మిలిటెంట్లు వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ బంధించారు. ఈ దాడిలో ఆరుగురు మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తే.. ప్రయాణికులందరినీ చంపేస్తామని బెదిరించింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది.

* పొరుగుదేశం కెనడా (Canada)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 25 శాతం టారిఫ్‌ (Tariff) విధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25శాతం పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో (Ontario) ప్రకటించింది. ఈ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాల విషయంలో కెనడా వైఖరిని తప్పుపడుతూ.. ఆ దేశాన్ని అతిపెద్ద సుంకాల దుర్వినియోగదారుగా అభివర్ణించారు. ‘‘ఒంటారియో ప్రీమియర్ మా రాష్ట్రాలకు విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. విద్యుత్‌పై టారిఫ్‌లను ప్రకటించే అవకాశం కూడా ఆ దేశానికి లేదు. ఇకపై అ కెనడాకు అమెరికా సబ్సిడీ ఇవ్వబోదు. మాకు మీ కార్లు, కలప, శక్తి, విద్యుత్తు, ఇంధనం ఏవీ అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు త్వరలోనే తెలుసుకుంటారు’’ అని ట్రంప్‌ కెనడాను హెచ్చరించారు. కాగా ప్రస్తుతం అమెరికాకు అత్యధిక ఇంధన ఎగమతులు కెనడా నుంచే వెళ్తున్నాయి. కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోపవర్, సహజవాయువు, ఎలక్ట్రిసిటీపై యూఎస్ ఆధారపడివుంది.

* ఆదోని కేసులో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది. ఆదోని త్రీటౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 353(1) , 353(2), 353(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విజయవాడ నుంచి పిటి వారెంట్ పై అరెస్టు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు పోసాని. బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వు చేశారు మేజిస్ట్రేట్. అయితే పోసానికి బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన మేజిస్ట్రేట్.. ఈ రోజు బెయిల్ మంజూరు చేశారు.

* గ్రూప్-2 ఫ‌లితాల్లో తొలి ర్యాంకు సాధించిన నారు వెంక‌ట హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి కోదాడ వాసి. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తండ్రి ర‌మ‌ణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొన‌సాగుతున్నారు. 447.088 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ ర్యాంకు సాధించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డికి శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

* తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళాలు రూ.2,200 కోట్లు దాటాయని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు. ‘‘1985లో తిరుమలలో అన్నదాన పథకాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రారంభించారు. 2014లో శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌గా తితిదే పేరు మార్చింది. నాడు 2వేల మందితో ప్రారంభమై .. ప్రస్తుతం రోజుకు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసే స్థాయికి ట్రస్ట్‌ అభివృద్ధి చెందింది. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు దాదాపు 9.7లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో రూ.కోటి.. అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలు ఇచ్చిన దాతల సంఖ్య 139. తిరుమలలో ఒక్క రోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలు. కాగా.. ఇప్పటి వరకు 249 మంది దాతలు రూ.44లక్షల చొప్పున విరాళం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అన్న ప్రసాదంపై తితిదే ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్న ప్రసాదం వితరణ చేస్తున్నాం. భోజనం మెనూలో వడలను కూడా వడ్డిస్తున్నారు. తితిదే అందిస్తోన్న అన్నప్రసాదంపై భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’’ అని బీఆర్‌ నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

* సాంకేతిక యుగంలోనూ మూఢవిశ్వాసాల గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. దొంగ బాబాలను నమ్మి డబ్బులు కోల్పోవడం, క్షుద్రపూజల పేరుతో నరబలి ఇవ్వడం వంటివి వార్తల్లో చూస్తుంటాం. అయితే, చైనాలో తాజాగా ఓ విచిత్రమైన మూఢనమ్మకం పుట్టుకొచ్చింది. బ్యాంకుల ప్రాంగణాల్లో తవ్వి తీసిన మట్టిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందని, ధనవంతులవుతామని నమ్ముతున్నారు. దీనికి కారణం కొన్ని వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్‌ అంగళ్లే. బ్యాంకు మట్టిని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరగుతుందంటూ ‘బ్యాంక్‌ సాయిల్‌(బ్యాంక్‌ మట్టి)’ని విక్రయిస్తున్నాయి. ప్రజలు వాటిని గుడ్డిగా నమ్మి కొనుగోలు చేస్తున్నారు.

* గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉన్నతాధికారులకు ఇవ్వలేమని సుప్రీం కోర్టు (Supreme Court) పేర్కొంది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఓ మహిళను గ్రామ సర్పంచిగా తిరిగి నియమిస్తూ గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పంచాయతీ ప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించిన అనేక ఘటనలు ఇటీవల తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించిన రెండు, మూడు కేసుల్లో మేం తీర్పులు ఇచ్చాం. మహారాష్ట్రలో ఇలా తరచూ జరుగుతోంది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు ఉండాలి. గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వకూడదు’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు పాత కేసులను బయటకు తీసేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది.

* రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు, హైవేల కోసం గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్‌ వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ టెండర్ల పక్రియ పూర్తయింది. దాదాపు 95శాతం భూ సేకరణ కూడా పూర్తయింది. రూ.వెయ్యి కోట్లతో 12 ఆర్వోబీలు కూడా మంజూరు చేశారు. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యమవుతున్నందున.. గుడిమల్కాపూర్‌ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. 62 కి.మీ మేర శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు’’ అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

* గుంటూరుకు చెందిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ మధ్యంతర బెయిల్‌ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. కానీ, గడువు సమయానికి లొంగిపోయేందుకు బోరుగడ్డ జైలుకు రాలేదు. దీంతో జైలు అధికారులు ఏపీ హైకోర్టుకు సమాచారమందించారు. బోరుగడ్డ వ్యవహార శైలి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి కూడా జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. బెయిల్‌ పొందే సమయంలో బోరుగడ్డకు పూచికత్తుగా ఉన్న వారి వివరాలను జైలు అధికారులు పోలీసులకు సమర్పించారు.

* దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో సీఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌, సీఎస్‌ విజయానంద్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z