డల్లాస్‌లో తెలుగు వనంలో గజల్ పరిమళంపై సాహితీ సదస్సు

Featured Image

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు వనంలో గజల్ పరిమళం అనే అంశంపై 219వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఆదివారం నాడు డాలస్‌లో నిర్వహించారు. సమన్విత మాడా ప్రార్థనా గేయంతో కార్యక్రమం ప్రారంభించారు. సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగత ఉపన్యాసం చేశారు. టాంటెక్స్ సాహిత్య వేదిక గత 18 ఏళ్లుగా ప్రతి మూడో ఆదివారం సాహిత్య కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తోందని తెలిపారు

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొరుప్రోలు మాధవరావు, విజయలక్ష్మి కందిబండ, రసవిహారి పాల్గొన్నారు. రసవిహారి గజల్ గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయలక్ష్మి కందిబండ మాట్లాడుతూ గజల్ రచనలో సుకుమారమైన పదాల ఎంపిక, చమత్కారాన్ని పండించే ఊహాశక్తి, భావనల సూటిదనం కీలకమని వివరించారు. గజల్ వినిపించగానే శ్రోతలలో వావ్ లేదా శభాష్ అనే స్పందన కలిగించే శక్తి ఉండాలనేది గజల్ ప్రత్యేకత అని అన్నారు. ఆమె తన గురువు మాధవరావు మార్గదర్శకత్వంలో వెయ్యికి పైగా గజల్స్ రాసిన విషయాన్ని పంచుకున్నారు. వాటిలో 108 గజల్స్ చంద్రసఖి పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయని తెలిపారు.

మాధవరావు గజల్ చందస్సు, నిర్మాణం, భావప్రకటన అంశాలను లోతుగా విశ్లేషించారు. ఆయన ఉర్దూ గజల్ మూలాలను, తెలుగు భాషలో అది ఎలా పరిణామం చెందిందో వివరించారు. గజల్ కేవలం ప్రేమకథలు లేదా విలాస జీవన వర్ణనలకే పరిమితం కాకుండా, నేటి సామాజిక అంశాలు, సమస్యలు, సందేశాలను కూడా ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

డాక్టర్ యు. నరసింహారెడ్డి మన తెలుగు సిరిసంపదలు కార్యక్రమానికి గుర్తింపుగా ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన తెలుగు భాషలోని పొడుపు కథలు, ప్రహేళికలు, పదభ్రమకాలు వంటి వైవిధ్యభరిత అంశాలను పరిచయం చేస్తున్నారని పాల్గొన్నవారు అభినందించారు. టాంటెక్స్ అధ్యక్షుడు పొట్టిపాటి చంద్రశేఖర్ తరఫున ప్రధాన అతిథులను సన్మాన పత్రాలతో సత్కరించారు. సతీష్ బండారు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, గౌతమి, రాజా కాల్వ, శ్రీధర్ సిద్ధ, గోడవర్తి నవీన్, లెనిన్ వేముల, మద్దుకూరి చంద్రహాస్, గోవర్ధనరావు నిడిగంటి తదితరులు పాల్గొన్నారు.

Tags-TANTEX Literary Meet On Telugu Gajals

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles