అమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకం

🕑 Published: May 09, 2026 at 06:38 PM CST

అమెరికాకు పర్యాటకులుగా తమవారి వద్దకు వచ్చే ప్రవాస తెలుగువారు ముదివయస్సులలో సరికొత్త స్నేహగీతాలు లిఖిస్తున్నారు. సాయంకాలం పూట స్థానిక పార్కుల్లో, కమ్యూనిటీ కేంద్రాల్లో కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒంటరితనానికి దూరంగా సేదతీరుతున్నారు. మే-ఆగష్టు నెలల మధ్య ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు అమెరికాకు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇండియాలో ఎండల నుండి తప్పించుకోగలగడం, అమెరికాలోని మనవడు-మనవరాళ్ల బడులకు సెలవులు కావడం దీనికి ఊతమిస్తోంది. పదవీవిరమణ చేసినవారితో పాటు ఉద్యోగస్థులు కూడా పైఅధికారుల అనుమతితో అమెరికాలో పర్యటిస్తున్నారు.

పిల్లలు ఆఫీసులకు వెళ్లిపోయాక ఖాళీగా ఉండే గృహాల్లో రోజంతా ఒంటరితనంతో గడిపే వీరంతా సాయంకాలానికి స్థానికంగా ఒకచోట కలుసుకుని నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాల్లో పాల్గొంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు మానసికంగా కూడా ఆసరాగా నిలబడుతున్నారు. భాష సమస్యలు, బయటకు స్వతంత్రంగా వెళ్లలేకపోవడం వంటి సవాళ్లకు కూడా అమెరికా పార్కులు సమాధానమిస్తున్నాయి. నలుగురితో కలివిడిగా ఉండటం వలన సొంత నెట్‌వర్క్ ఏర్పడి పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించుకుంటున్నారు. భిన్న భాషలు, భిన్న రాష్ట్రాలవారితో పరిచయాలు స్నేహాలుగా మారి..రోజువారీ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలుగా విస్తరిస్తున్నాయి. వాట్సాప్ వంటి డిజిటల్ వేదికల ద్వారా ఈ సమూహాలు మరింత బలపడుతున్నాయి. నడక గ్రూపులు, పూజలు, పిక్నిక్లు, పరస్పర ఆహ్వానాలు వంటి కార్యకలాపాలు సాధారణంగా మారుతున్నాయి. దీనివల్ల విదేశంలో ఉన్నప్పటికీ ఒక ఆత్మీయ వాతావరణం ఏర్పడుతోంది. భారతదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ మాధ్యమాల ద్వారా నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. కొందరు తిరిగి అమెరికాకు వచ్చినప్పుడు మళ్లీ కలుసుకోవడం కూడా సాధారణంగా మారింది.

కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉన్న ఎన్నారై దంపతులకు మాతృత్వ సెలవులు తక్కువగా ఉండటం, నవజాత శిశువుల డే-కేర్ సెంటర్లు, ఆలనా-పాలన చూసే ఆయాల ఖర్చు భారీగా ఉండటంతో ఒక ఆరునెలలు తల్లిదండ్రులు, మరో ఆరునెలలు అత్తమామలు ఈ శిశువులు, బాలింతల సంరక్షణ చూసుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు. గ్రాడ్యూయేషన్లు, వివాహాలు, గృహప్రవేశాలు, ఆరోగ్య పరీక్షలు, టూరిజం వంటివి తర్వాతి స్థానాల్లో ఉంటున్నాయి. ఎదిగిన పిల్లలు ఉన్నవారు..ఆయా చిన్నారులకు కథలు చెప్పడం, ఆటలు ఆడించడం, స్థానికంగా పర్యటించడం వంటి వాటి ద్వారా తరాల మధ్య బంధాన్ని బలపరుచుకుంటున్నారు. ఆరునెలలు ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ వేలమైళ్ల ఆవల ప్రతిరోజు ఇరుగుపొరుగుతో కొత్త పరిచయాలు పెంచుకుంటూ తెలుగు వాసనలకు దగ్గరగా జీవనం గడుపుతున్నారు. పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, లైబ్రరీలు, స్కూల్ పరిసరాలు వంటి చోట్ల పచ్చదనం అధికంగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వీరి "సంధ్యా స్నేహగీతా"లకు వేదికలు అవుతున్నాయి.

★ స్థానిక కార్యక్రమాల్లో సందడి

అమెరికాకు వచ్చే తెలుగు ఎన్నారై తల్లిదండ్రులు కేవలం గృహాలకే పరిమితం కావట్లేదు. తమకు దొరికిన పరిచయాల ద్వారా స్థానికంగా జరిగే ఎన్నో భారతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక బృందంగా ఏర్పడి కారుల్లో, బస్సుల్లో సభాప్రాంగణాలకు వెళ్లి సందడి చేస్తున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు పండుగలు, యోగా, మాతృభాషా దినోత్సవాలు కూడా సమిష్ఠిగా జరుపుకుంటున్నారు.

★ యుద్ధాలైనా నో ప్రాబ్లం!

అమెరికాకు వచ్చే తల్లిదండ్రులు తమ ప్రయాణ ప్రణాళికలను సగటున ఏడాదికి ముందుగానే నిర్ణయించుకుని విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. టికెట్ బుకింగ్ నుండి ప్రయాణ తేదీకి మధ్య జరిగే అంతర్జాతీయ పరిస్థితులు వీరిపై ప్రభావాన్ని చూపట్లేదు. ఉద్యోగస్థుల మాదిరి కాకుండా ప్రయాణ తేదీల్లో పూర్తి వెసులుబాటు ఉండటం కారణంగా టికెట్లపై విమానయాన సంస్థలు చేసే మార్పులను సైతం వీరు స్వాగతిస్తున్నారు. క్యాన్సిలేషన్ ఫీజు లేకపోవడం, ధరలో మార్పు లేకుండా టికెట్ మార్చుకోగలిగే అవకాశాలు సానుకూల అంశాలుగా ఉంటున్నాయి. గమ్యస్థానం చేరడమే లక్ష్యంగా సాగే వీరి ప్రయాణ దృక్పథం కూడా బాగా కలిసొస్తోంది. అందుకే యుద్ధాలైనా సరే తల్లిదండ్రుల ప్రయాణాలు మాత్రం నిరాటంకంగా సాగుతున్నాయి.

★ యువకుల కన్నా చురుగ్గా ఉంటున్నారు

భాను మాగులూరి, ఎన్నారై పేరేంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, వర్జీనియా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే వయోధిక ప్రవాస తెలుగు తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఎన్నారై యువత కన్నా చురుగ్గా ఉంటున్నారని తెలిపారు. ఫలానా చోట కార్యక్రమం అంటే స్వయంగా రవాణా ఏర్పాట్లు చేసుకుని మరీ పాల్గొంటున్నారు. జాతీయ సమైక్యతను పెంపొందించే ఆపరేషన్ సింధూర్‌కు అమెరికా నుండి సంఘీభావం తెలపడంలో వీరు ముందువరుసలో ఉన్నారు. డీసీలోని భారత ఎంబసీ వద్ద జాతీయ దినోత్సవాలు నిర్వహించినప్పుడు ఎన్నారై తల్లిదండ్రుల సందడి ఆకర్షించింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో అతిథులుగా వీరు హాజరవుతున్నారు. వేడుకల్లో పాల్గొనేవారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు ప్రత్యేక బస్సుల్లో వీరికి రవాణా ఏర్పాట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

★ ఎక్కడైనా తల్లిదండ్రులదే కీలక బాధ్యత

శ్యామ్ రావు, కృష్ణారెడ్డి, ప్రసాద్ (లిటిల్ ఎల్మ్, టెక్సాస్) మాట్లాడుతూ డల్లాస్ పరిసర ప్రాంతమైన లిటిల్ ఎల్మ్‌లో పర్యటిస్తున్న ఎన్నారై తల్లిదండ్రులందరూ కలిసి స్పిరిటాస్ రాంచ్ వాకర్స్ క్లబ్ పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 55 మంది సభ్యులు గల ఈ క్లబ్‌లో ప్రతిరోజు ఉదయం 30నిమిషాలు, సాయంత్రం 2గంటలు నడకతో పాటు కుటుంబ విశేషాలు, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించుకుంటున్నారు. కమ్యూనిటీ సెంటరులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత, టేబుల్ టెన్నిస్, యోగా వంటి క్రీడలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అమెరికా జీవన ప్రమాణాలు, స్థానిక విషయాలను స్వదేశంలోని బంధువులతో పంచుకుంటున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. ఇండియాలోనైనా, అమెరికాలోనైనా కుటుంబ సంరక్షణలో తల్లిదండ్రులదే కీలకపాత్ర అని..తదుపరి తరంతో అనుబంధం కోసం తాము అమెరికాలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు.

📲 Join Our WhatsApp Channel
Deepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారంSaanvi Gullapalli Donates 5000 USD To North Texas FoodBankసింగపూర్‌లో 409వ సారి భాగవత సప్తాహం చేసిన వద్దిపర్తిA HUB GLOBAL Hosts Investor Launch of "Yadadri Hills"ATA Conducts Chess Tournament Successfully in Extonతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో వీలునామాపై అవగాహన సదస్సుడల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలుతెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంటెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతితానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడండిసింగపూర్ ప్రవాసులతో మంత్రి సత్యకుమార్ భేటీ
Previous Article Next Article