🕑 Published: June 30, 2026 at 09:39 AM CST
తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ‘అచ్చ తెలుగు తిట్లు’ అనే అంశంపై జరిగిన 93వ అంతర్జాల సమావేశం చాలా ఉల్లాసంగా జరిగింది. ఆరు సంవత్సరాలకు పైగా ‘నెలనెలా తెలుగు వెలుగు’ పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య వేదిక అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఇందులో భాగంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘‘తెలుగు భాషలో అనాదిగా తిట్లు ఒక భాగంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, స్నేహితుల మధ్య వాడే కొన్ని పదాలు బయటివారికి కఠినంగా అనిపించినా, అవి అక్కడ వారి ఆప్యాయత లేదా సంబంధాలకు సంకేతాలుగా ఉంటాయి. కన్యాశుల్కం వంటి నాటకాల్లో, పాత సినిమాల్లో వాడిన సరదా తిట్లు సునిశితమైన హాస్యాన్ని పంచాయి. వీధి భాష, గ్రామీణ సంభాషణల్లో తిట్లు అలవోకగా చాలా సహజంగా జాలువారతాయి. అవి మోతాదు మించితే బూతులుగా పరిణమిస్తాయి. ప్రస్తుతం రాజకీయాల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు బూతులు తిట్టుకోవడంతో సమాజంలో జుగుప్సాకర వాతావరణాన్ని సృష్టిస్తోంది. కాబట్టి వాడే భాష పట్ల జాగ్రత్త అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు వేద కవి, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. తానా ప్రపంచ సాహిత్యవేదిక ఇంతవరకూ నిర్వహించిన అంతర్జాల సమావేశాలన్నీ ఒక ఎత్తు, ఈ తిట్ల సమావేశం మరో ఎత్తు అంటూ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఇతర కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రామాయణ, భారత, భాగవతాల్లోని అనేక సందర్భాల్లో ప్రయోగించిన తిట్లు సహా, ఆయన స్వయంగా రాసిన తిట్ల దండకం, తిట్ల పద్యాలను, పాటలను, పేరడీలను గానంచేసి ఈ సమావేశానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిట్టేవాడికి బీపీ తగ్గుతుందని, తిట్టించుకున్న వాడికి బీపీ పెరుగుతుందన్నారు. తెలుగుభాష ఉన్నంత వరకు తిట్లు ఉంటాయని, తిట్లు భాషకు బలం అన్నారు. వాడే సమయం, సందర్భం చూసుకోవడం చాలా అవసరమన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. తిట్లు ప్రాంతాలను బట్టి మార్పు చెందుతూ వివిధ యాసలతో వాడే పదాలు వినోదం కల్గిస్తాయన్నారు. ప్రముఖ రచయిత జీఎస్ మోహన్ రాసిన ‘జానపద తిట్లు’ తనకు నచ్చిన గ్రంథం అని, ఆ గ్రంథాన్ని చూపుతూ దానిలోని కొన్ని తిట్లను తనదైన శైలిలో వినిపించి నవ్వులు కురిపించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు, కన్నడ, తెలుగు భాషలలో ఎన్నో గ్రంథాలను రచించిన ప్రముఖ రచయిత ఆచార్య జీఎస్ మోహన్ మాట్లాడుతూ అన్ని భాషల్లోనూ తిట్లు ఉన్నాయని, వివిధ భాషలు, ప్రాంతాల్లో వాడే తిట్లను ఎంతో శ్రమించి సేకరించానని చెప్పారు. జానపదులు వాడిన తిట్లతో 1980ల్లోనే తాను రాసిన గ్రంథం ఎంతో మంది ఆదరణ పొందడం సంతోషమంటూ వివిధ ప్రాంతాల్లో వాడే తిట్లను వినిపించారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డి.విజయలక్ష్మి మాట్లాడుతూ.. తిట్ల మీద ఒక డిప్లొమా పొందానని, ఎంతో పరిశీలనాత్మక దృష్టితో ఒక సిద్ధాంత వ్యాసం రాసే ఆలోచనతో విద్యార్థులను ప్రోత్సహిస్తే ఎవరూ మందుకు రాలేదన్నారు. తిట్లు దాని పుట్టు పూర్వోత్తరాలను ఎన్నో ఉదాహరణలతో విశదీకరించారు. మరో విశిష్ట అతిథిగా పాల్గొన్న రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ తెలుగు సాహిత్యంలో వివిధ సందర్భాల్లో వాడిన తిట్లను, వాటి మూలాలను, వ్యుత్పత్తి అర్థాలను ఎంతో లోతైన విశ్లేషణతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అలనాటి తెనాలి రామకృష్ణ వాడిన తిట్లు మొదలుకుని, నేటి జన సామాన్యంలో ఉన్న తిట్లతో సహా ఎన్నో ఉదాహరణలతో వాడిన తిట్లు ఒక పరిశోధనా పత్రంలా సాగి సమావేశానికి సాధికారత చేకూర్చింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిట్ల మీద ఇంత సుదీర్ఘంగా ఒక సమావేశం జరగడం బహుశా ఇదే మొదటిసారై ఉంటుందన్నారు. పాల్గొన్న వక్తలందరూ ఎన్నో అరుదైన, విలువైన అంశాలను స్పృశించి ఈ తెలుగు తిట్ల సమావేశానికి శోభను చేకూర్చారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

