🕑 Published: September 04, 2026 at 09:29 PM CST
కమ్యూనిటీ సేవలకు గుర్తింపుగా బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు కృష్ణప్రసాద్ సోంపల్లికి మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రశంసా పత్రంతో సత్కరించింది. మసాచుసెట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ రొనాల్డ్ మరియానో జారీ చేసిన ఈ ప్రశంసా పత్రాన్ని స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్ గురువారం నాడు కృష్ణప్రసాద్‌కు అందజేశారు. కృష్ణప్రసాద్ అసాధారణమైన కమ్యూనిటీ సేవా నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన చేసిన వాలంటీర్ సేవలు అనేక మంది వ్యక్తులు మరియు కుటుంబాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
విద్యా, యువత, పాఠశాల సామగ్రి పంపిణీ, ఆహార పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి నిర్వహణలో సోంపల్లి కీలకపాత్ర వహించారు. సమాజానికి తిరిగి ఇవ్వడం, ఒకరి జీవితంలోనైనా మంచి మార్పు తీసుకురావడం తనకు సంతృప్తినిచ్చిందని, ఈ ప్రశంసా పత్రాన్ని అందించిన స్తేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు తనకు మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తోందన్నారు.