🕑 Published: May 06, 2026 at 03:44 PM CST
వద్దిపర్తి పద్మాకర్ పరమార్థ మరియు క్రాఫ్ట్ వోయేజెస్ సంస్థల ఆహ్వానం మేరకు సింగపూర్‌లో పర్యటించి ఏప్రిల్ 18 నుండి 24 మధ్య 409వ భాగవత సప్తాహాన్ని ఘనంగా నిర్వహించారు. అష్టాదశ పురాణాలలో మకుటాయమానమైన శ్రీమద్భాగవతం, వేదవ్యాస మహర్షి రచించిన 18,000 శ్లోకాలతో, 12 స్కంధాలతో కూడిన మహాగ్రంథం. వేదమనే కల్పవృక్షం నుండి పండిన ఫలంగా దీనిని వర్ణిస్తారు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని స్వరూపమే భాగవతమని, “కృష్ణుడే భాగవతం – భాగవతమే కృష్ణుడు” అని పెద్దలు పేర్కొంటారు. భాగవత మహిమను అన్ని పురాణాలు కొనియాడాయి. “భాగవతం వినగానే బాగవుతాం” అనే ఆర్యోక్తి ప్రసిద్ధి. సప్తాహం అనగా ఏడు రోజులపాటు దీక్షతో ఋత్వికులు, పండితులు పాల్గొన్న వారి గోత్రనామాలతో భాగవత పారాయణం నిర్వహిస్తారు.
వద్దిపర్తి ప్రవచనం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి. రుక్మిణీ కళ్యాణం, లక్ష్మీనారాయణ హోమం వంటి వైభవోపేత కార్యక్రమాలు నిర్వహించారు. శుకస్థల్, కాశీ, అయోధ్య, మధుర, బృందావనంతో పాటు అమెరికా, దుబాయి, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్ దేశాల్లో 408 సార్లు పద్మాకర్ భాగవత సప్తాహాలు నిర్వహించారు. అష్టాదశ పురాణాల నుండి సంకలనం చేసిన 100 స్తోత్రాల గ్రంథం “స్తోత్ర పద్మాకరము”, స్నిగ్ధ ఆకుండి రచించిన “అర్జున అండ్ అభిరామి – ద సెలెస్టియల్ థెఫ్ట్” పుస్తకాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. శ్రావంతి, వల్లీ జాహ్నవి, ప్రసన్న, శ్రీదేవి, రాంసుధ, అపర్ణ, పావని తదితరులు నిర్వహణా సహకారం అందించారు.




