🕑 Published: April 24, 2026 at 05:54 PM CST
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వ్యక్తి ఫణి తాళ్లూరు(52)కు స్థానిక కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బుధవారం నాడు వెలువరించిన తీర్పులో న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విడుదల అనంతరం అతనిపై అయిదేళ్ల పాటు పర్యవేక్షణ ఉంటుంది. మైనర్లపై జరిగే నేరాల పట్ల అమెరికా న్యాయవ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ కేసు స్పష్టం చేస్తోంది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం..ఫణి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మైనర్లకు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు, ఫోటోలు పంపేవాడు. ఒక టీనేజ్ బాలికకు తన నగ్న చిత్రాలు పంపి, తిరిగి ఆమె నుంచి కూడా అలాంటి చిత్రాలు పంపాలని ఒత్తిడి చేసినట్లు కోర్టులో వెల్లడైంది. ఈ ఘటన మొదట 2022లో బయటపడగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో బాధితురాలు తాను 11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఫణి చేతిలో పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. ఈ దాడులు ఒక్కసారి జరగలేదని, దీర్ఘకాలం కొనసాగాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణలో భాగంగా ఫణి తన నేరాలను దాచిపెట్టేందుకు బాధితులను నిశ్శబ్దంగా ఉండమని, చాట్ సందేశాలు, ఇతర ఆధారాలను డిలీట్ చేయమని బలవంతం చేసినట్లు బయటపడింది. ఇవి సాధారణ తప్పులు కావని పూర్తిగా తెలిసి చేసిన దారుణ చర్యలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. శిక్ష విధించే సమయంలో ఫణి తనకు మద్యపానం అలవాటు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, తల్లి మరణం తర్వాత వచ్చిన డిప్రెషన్ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని వాదించినప్పటికీ కోర్టు ఏకీభవించలేదు.
2019లో ఈ వ్యవహారం బయటకు రావడంతో స్థానిక తెలుగు పెద్దలు రాజీకి యత్నించారు. బాలిక తల్లిదండ్రులు కాదనడంతో కేసుల భయంతో ఇండియా వచ్చిన ఫణి...రెండేళ్ల అనంతరం అమెరికాకు తిరిగి వచ్చాడు. 2022 నుండి కొనసాగిన దర్యాప్తు ఆధారంగా 2024 అక్టోబర్‌లోనే ఫణి అరెస్ట్ అయ్యాడు. తుదితీర్పు బుధవారం నాడు వెలువరించారు. ఈ ఘటన అమెరికాలోని తెలుగు కుటుంబాలకు ఒక గట్టి హెచ్చరికగా మారింది. ముఖ్యంగా పిల్లల ఆన్‌లైన్ భద్రత, సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, ఫోటో అభ్యర్థనలు, వ్యక్తిగత చాట్స్ వంటి అంశాలపై పిల్లలకు ముందుగానే అవగాహన కల్పించడం అవసరమని చెబుతున్నారు.


