🕑 Published: October 21, 2026 at 04:25 PM CST
గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం (TAGB) ఆధ్వర్యంలో వార్షిక దసరా దీపావళి వేడుకలను స్థానిక లిటిల్‌టన్ హైస్కూల్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్‌లో శనివారం నాడు సందడిగా నిర్వహించారు. స్పూర్తి జితేందర్ సంగీత కచేరీ ఆకట్టుకుంది. అమెరికాకు చెందిన 'లెహరి బ్యాండ్' ప్రదర్శన అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శివుని ఏడు దివ్య నృత్యాలను, వాటి వెనుక ఉన్న పౌరాణిక కథలను వర్ణించే అద్భుతమైన నృత్య రూపకం "సప్త తాండవం" ప్రదర్శించారు. ష్రూస్‌బరీలోని ‘నాట్యం స్కూల్ ఆఫ్ డాన్స్’ ఆదిలక్ష్మి గొల్లపూడి నృత్య దర్శకత్వంలో 40 మంది ప్రవాసులు ఈ రూపకంలో పాల్గొన్నారు. 150 మంది స్థానిక కళాకారులు 30కి పైగా ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు. బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ‘హుయ్ షీ’ నేతృత్వంలోని చైనీస్ నృత్య బృందం "చైనీస్ వాటర్ డాన్స్" అలరించింది. పిల్లల కోసం వినోదభరితమైన కథల పోటీని నిర్వహించి బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. టెన్నిస్ పోటీ బహుమతులను అందజేశారు. షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సంపత్ కందాళను వేదికపై సత్కరించారు.
సంస్థ అధ్యక్షురాలు సుధ మూల్పూర్ ప్రసంగిస్తూ సభికులకు దసరా-దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతిని భావితరాలకు నేర్పించే లక్ష్యంతో సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులు దీప్తి కోరిపల్లి(తదుపరి అధ్యక్షురాలు), జగదీష్ చిన్నం (కార్యదర్శి), సూర్య తేలప్రోలు (కోశాధికారి), మానస కృష్ణ (సాంస్కృతిక కార్యదర్శి), ధర్మకర్తల మండలి సభ్యులు కాళిదాస్ సురపనేని (అధ్యక్షుడు), చంద్ర వల్లూరుపల్లి (మండలి సభ్యుడు), కళ్యాణ్ కాకి (మండలి సభ్యుడు), శిరీష కేతిరెడ్డి (మండలి సభ్యురాలు), శ్రీనివాస్ గొంది (సభ్యుడు) పాల్గొన్నారు.



