🕑 Published: October 03, 2026 at 07:18 PM CST
అమెరికా రాజధాని పరిధిలో అక్టోబర్ 2, భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారతరత్న, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జన్మదినం సందర్భంగా ప్రవాస భారతీయులు, పెద్దలు వారి చిత్రపటాలకు పూలతో ఘన నివాళి అర్పించారు. శతాబ్దాల బానిస సంకెళ్లు తెంచి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం తో పాటు జన జాగృతికై, జాతి చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసి అమరులైన మహాత్మునికి , మహనీయులకు ఘన నివాళి అర్పించటం మన భాద్యతగా ఏ దేశమేగినా యందు కాలిడినా, ప్రప్రధమంగా భారతీయులుగా మన మూలాలను గుర్తు చేసుకుంటూ, మన మాతృభాషను కాపాడుకోవటం మనందరి విధి అని సమన్వయ కర్త భానుప్రకాష్ మాగులూరి తెలిపారు.
మహాత్ముల గొప్పతనం వారి సాదాసీదా జీవనశైలిలో, దేశభక్తిలో మరియు ఉన్నత విలువల్లో పాటించి చాటుకున్నారు . దశాబ్దాల పాటు సత్యం, అహింస సిద్దాంతం సదా ఆచరిస్తూ సామాజిక భాద్యత, నిరాడంబరతను నిరంతరం పాటిస్తూ జాతిని ఐక్యతతో ఏకతాటిపై నిలిపి, శాంతియుత పోరాటం చేస్తూ, ప్రపంచానికే అహింస సిద్దాంతాన్ని ప్రబోధించిన శాశ్వత ఘనత మహాత్మా గాంధీజీది అని పెద్దలందరూ గుర్తు చేసుకున్నారు.
భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి, ఈ తరమే కాదు తర తరాల నాయకులకు ఆదర్శంగా నిలిచారు. నిజాయితీ, అంకితభావం, దేశ భక్తి, సమాజ హితం పునాదులుగా తన జీవిత చరమాంకం వరకూ పాటిస్తూ నిరాడంబరతకు నిలువెత్తు అద్దంలా నిలిచి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేసుకుంటూ ప్రవాసులు నివాళి అర్పించారు.
వక్తలు మాట్లాడుతూ.. మన చరిత్ర, మహనీయుల గొప్పదనం, వారి ఆదర్శ జీవితం.. కేవలం సందర్భానుసారం మాట్లల్లో కాక ఈ తరం యువత, చిన్నారులకు నిరంతరం గుర్తుచేస్తూ.. సమస్యలను అవకాశాలుగా మార్చుకోకుంటూ శ్రద్హ, సహనం పాటిస్తూ, సంఘ జీవనంలో సమైక్య సహోదర భావం చాటుకుంటూ వృత్తి, ఉపాధి రీత్యా ఏ దేశంలో ఉన్నా చట్టాలను గౌరవిస్తూ శాస్త్రీయ దృక్పధంతో ఉన్నత ఆదర్శాలను నిర్దేశించుకొని పట్టుదలతో జీవితంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎండూరు సీతారామారావు, కొత్తూరు కామేశ్వరరావు, చిట్టెల సుబ్బారావు, రామ్మోహన్ రెడ్డి, చింతా రాంబాబు, మైనేని రాధా కృష్ణ, మేకల రామిరెడ్డి, జంపాల కృష్ణ మోహన్, చెరుకూరి ఇందుశేఖర్, కట్టా అంకమ్మ, జిరబోయిన రాజేందర్, అన్నం పూర్ణచంద్రరావు, అల్లం లింగం, సత్యనారాయణ, శంకర్ రెడ్డి, సురేష్, రమేష్, బలరాం, భాస్కరరావు, కృష్ణమూర్తి, ప్రభాకర్ మరియు ఇతరులూ పాల్గొన్నారు.
