Politics

తెదేపాకు 30 ఉండి భాజపాకు 2 ఉన్నా ప్రతిపక్షం తెదేపానే!

tdp as opposition despite majoriry

వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, తనను తాను సరిచేసుకుంటూ… పదహారు మైలురాళ్లను అధిగమించింది భారత ఎన్నికల వ్యవస్థ. ప్రస్తుతం పదిహేడో నంబరు చౌరస్తా దగ్గర ఉంది. కొత్త అడుగు వేసేముందు… పాత ముద్రల్ని తడిమి చూసుకుంటే…ఎంత కథ, ఎన్ని జ్ఞాపకాలూ! జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, అంబేద్కర్‌ మొదలైన ఉద్ధండులు చట్టసభల్లో చేసిన ఉపన్యాసాలు, పాటించిన సంప్రదాయాలు, నెలకొల్పిన విలువలు నేటి నేతలకు మార్గదర్శనం చేస్తాయి. *1951-52 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. లెఫ్ట్‌, సోషలిస్ట్‌ పార్టీలు కూడా గణనీయమైన స్థానాల్నీ ఓట్ల శాతాన్నీ సాధించుకున్నాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌, ఆచార్య నరేంద్రదేవ్‌ల సారథ్యంలోని సోషలిస్ట్‌ పార్టీ 12 స్థానాలను గెలుచుకుంది. జె.బి.కృపలానీకి చెందిన కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ (కేఎంపీపీ) 9 సీట్లను దక్కించుకుంది. జనసంఘ్‌ 3 స్థానాలకే పరిమితమైంది. *1957 కాంగ్రెస్‌ రెండోసారీ విజయం సాధించింది. అవిభాజ్య కమ్యూనిస్టులు 33 స్థానాలనూ… సోషలిస్ట్‌ పార్టీ, కేఎంపీపీల విలీనంతో ఏర్పడిన ప్రజా సోషలిస్ట్‌ పార్టీ (పీఎస్‌పీ) 19 సీట్లను కైవసం చేసుకుంది. అంబేద్కర్‌ స్థాపించిన ఆల్‌ ఇండియా షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ (ఎస్‌సీఎఫ్‌) 6 స్థానాలు గెలుచుకుంది. *1962 మూడో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మొదటి రెండు ఫలితాలే పునరావృతం అయ్యాయి. అయితే వివిధ పార్టీల్లో విభేదాలు తీవ్రతరం అయ్యాయి. రామ్‌మనోహర్‌ లోహియా పీఎస్‌పీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన అనుచరులు విలీనానికి ముందునాటి సోషలిస్ట్‌ పార్టీ తరపున పోటీచేశారు. అలాగే, కాంగ్రెస్‌లో స్వేచ్ఛా వాణిజ్యం వైపు మొగ్గుతోన్న ఓ వర్గం స్వతంత్ర పార్టీ తరపున పోటీ చేసింది. *1967 జవహర్‌లాల్‌ నెహ్రూ మరణానంతరం జరిగిన ఎన్నికలు ఇవి. అయినా, కాంగ్రెస్‌ మొట్టమొదటిసారిగా మూడింట రెండోవంతు మెజారిటీ సాధించలేకపోయింది. స్వతంత్ర పార్టీ, జనసంఘ్‌ 79 స్థానాలు గెలుచుకున్నాయి. వామపక్షాలు, సోషలిస్టులు 83 సీట్లు సాధించుకున్నారు. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అకాలీదళ్‌ 28 సీట్లు సాధించాయి. పీఎస్‌పీ మరింతగా విభజన చెంది జార్జ్‌ ఫెర్నాండెజ్‌ నేతృత్వంలో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ(ఎస్‌ఎస్‌పి) ఉద్భవించింది. *1971 దేశంలోనే తొలి మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ అఖండ విజయాన్ని సాధించారు. 1969లో కాంగ్రెస్‌ నుంచి ఇందిరను బహిష్కరించారు. అయినా మెజారిటీ ఎంపీలు ఇందిర వైపే ఉన్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ ఆమె వర్గాన్నే గుర్తించింది. ‘గరీబీ హఠావో’ నినాదం ఇందిరకు ఘనవిజయాన్నిచ్చింది. స్వతంత్ర పార్టీ 8 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. *1977 ఎమర్జెన్సీ ప్రభావం ఎన్నికలపై పడింది. కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు ఏకమై జనతాపార్టీగా ఆవిర్భవించాయి. మొరార్జీ దేశాయ్‌, తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. *1980 సంకీర్ణ ప్రయోగాలు బెడిసికొట్టాయి. మొరార్జీ దేశాయ్‌ రాజకీయాల నుంచి విరమించు కున్నారు. ఇందిరాగాంధీ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పదవీ కాలం పూర్తికాకముందే హత్యకు గురయ్యారు. *1984 ఇందిరాగాంధీ హత్య తర్వాత, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ 411 సీట్లను కైవసం చేసుకుని అజేయంగా నిలిచింది. జనసంఘ్‌లోంచి పుట్టుకొచ్చిన భారతీయ జనతా పార్టీ 2 సీట్లలో మాత్రమే గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం అనూహ్యంగా 30 ఎంపీ సీట్లను సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. *1989 బోఫోర్స్‌ ముడుపులు, పంజాబ్‌లో ఉగ్రవాదం, శ్రీలంకలోని తమిళుల సమస్య… తదితర కారణాల వల్ల కాంగ్రెస్‌ పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది. సోషలిస్టులు జనతాదళ్‌ పేరుతో మళ్లీ ఒక్కటయ్యారు. కానీ, 143 సీట్లే సాధించారు. బీజేపీ, వామపక్షాలు వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో, వీపీసింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ అధికారాన్ని చేబట్టింది. ఈ మైనారిటీ ప్రభుత్వం ఏడాదిలోపే పడిపోయింది. చంద్రశేఖర్‌ వర్గం బయటికి వచ్చి, కాంగ్రెస్‌ మద్దతుతో కొంతకాలం ప్రభుత్వాన్ని నడిపింది. *1991 పరిపూర్ణ మెజారిటీని సాధించలేకపోయినా, పీవీ నరసింహారావు నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. గడ్డు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగింది. పీవీ ఆర్థిక సంస్కరణలకు, సరళీకరణకు నాంది పలికారు. *1996 బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. కానీ బలనిరూపణలో విఫలమై… 13 రోజులకే పీఠం దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో… జనతాదళ్‌కి చెందిన దేవెగౌడ ప్రధాని పదవిని చేబట్టారు. తర్వాత గుజ్రాల్‌ పీఠం ఎక్కారు. ఇతను కూడా ఏడాదిలోపే దిగిపోవాల్సి వచ్చింది. *1998 బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా… ప్రాంతీయ పార్టీలు బాగా బలపడ్డాయి. 13 పార్టీల మద్దతుతో… వాజ్‌పేయి సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ, ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరణతో 13 నెలలకే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. *1999 సుస్థిర సంకీర్ణాల శకం ప్రారంభమైంది. బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఏర్పడింది. ప్రాంతీయ పార్టీలు 162 సీట్లను గెలుచుకోవడం విశేషం. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అయిదేళ్లు పాలించింది. *2004 ఈశాన్య రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రావడంతో, బీజేపీ ముందస్తు ఎన్నికల నగారా మోగించింది. కానీ ‘భారత్‌ వెలిగిపోతోంది’ నినాదం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. మన్మోహన్‌ అధికారాన్ని చేబట్టారు. *2009 భారత్‌-అమెరికా అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విభేదించి, మద్దతు ఉపసంహరించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో… యూపీయే స్పష్టమైన మెజారిటీని సాధించింది. మన్మోహన్‌ సింగ్‌ రెండోసారి ప్రధాని పీఠం ఎక్కారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 206 సీట్లను సాధించడం విశేషం. *2014 నరేంద్ర మోదీ పవనాలు దేశమంతా వీచాయి. యూపీయే-2 హయాంలోని అవినీతి పట్ల ప్రజలు ఓట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 44 సీట్లతో ప్రతిపక్ష హోదానూ పొందలేకపోయింది. 1984 తరవాత, ఓ రాజకీయ పార్టీ ఇంత ఘనమైన మెజారిటీని సాధించడం ఇదే తొలిసారి. *2019 అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ, పాత ప్రాభవం కోసం కాంగ్రెస్‌, దిల్లీని ప్రభావితం చేయగలిగేంత బలం కోసం ప్రాంతీయ పార్టీలూ… హోరాహోరీ పోరాటం సాగిస్తున్నాయి. ఓటరు మొగ్గు ఎటువైపన్నది ఫలితాల తర్వాతే తెలుస్తుంది. **ఏడు దశాబ్దాల్లో…. ఏ రాజకీయ పార్టీ కూడా 50 శాతం ఓట్లను సాధించలేక పోయింది. 2014 ఎన్నికల గణాంకాల ప్రకారం తెలంగాణలోని మల్కాజిగిరి అతి పెద్ద నియోజకవర్గం. 29.5 లక్షల మంది ఓటర్లు ఈ నియోజక వర్గంలో ఉన్నారు. అతి చిన్న నియోజకవర్గంగా లక్షద్వీప్‌ రికార్డులకెక్కింది. ఇక్కడ 47,972 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారమొదటి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో 2.58 కోట్ల బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగించారు. ఆఖరుసారిగా 2010లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో వీటిని వాడారు.రాష్ట్రపతి, రాజ్యసభ, విధాన మండలి ఎన్నికల్లో నేటికి కూడా బ్యాలెట్‌ బాక్స్‌లనే ఉపయోగిస్తున్నారు.1952తో పోలిస్తే ఓటర్ల సంఖ్య ఐదింతలు పెరిగింది. అప్పట్లో 46 శాతంగా ఉన్న పోలింగ్‌…2014 నాటికి 66 శాతానికి చేరుకుంది.లోక్‌సభ ఎన్నికల నిర్వహణ వ్యయం 1999 నుంచి 2014 మధ్యకాలంలో నాలుగింతలు పెరిగింది. గుజరాత్‌లోని జునాగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న బ్యానెజ్‌ గ్రామంలో… ఒక్క ఓటు మాత్రమే ఉంది. అయినా పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో… మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో 32 స్థానాలకు, తమిళనాడులోని 39 నియోజకవర్గాల్లో 29 స్థానాలకు 16 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడ్డారు.