Business

పిటీషన్ కొట్టి పారేశారు

mallya petition denied in uk court

కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్‌ మాల్యాకు యూకే న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించే విషయాన్ని ఆయన సవాలు చేస్తూ యూకే కోర్టులో లిఖిత పూర్వక పిటిషన్‌ వేశారు. కోర్టు సోమవారం దాన్ని కొట్టి వేసింది. దీనిపై తదుపరి వాదనలు జరగనున్నాయి. దీంతో ఆయన పై కోర్టుకు అప్పీల్‌ చేసుకునే అవకాశం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ మొత్తం తంతు పూర్తి కావడానికి కనీసం ఆరు వారాలైనా పట్టవచ్చు. గతేడాది డిసెంబర్‌ 9న మెజిస్ట్రేట్ కోర్టు విజయ్‌ మాల్యా వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా ఆర్బుత్నాట్‌ మాల్యా కేసుపై తీర్పునిస్తూ…భారత బ్యాంకులకు మాల్యా సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తిగా తేల్చిచెప్పింది. భారత్‌లోని పలు బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అతడిని భారత్ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి జాబితాలో చేర్చింది. మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లాండ్‌ హోం సెక్రటరీ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు. దీనికి వ్యతిరేకంగా వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యా పిటిషన్‌ దాఖలు చేశాడు.