Editorials

ఓరి వెధవల్లారా…మీ ఓటు కూడా అమ్ముకుంటారా?–TNI ప్రత్యేకం

telugu teachers selling their vote for money

?????????????????????????????????????
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యవాదులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఒక సామాన్య రోజువారి కూలీ పూట గడవని పరిస్థితుల్లో తమ ఓటును అమ్ముకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. యావత్ భారతదేశం నివ్వేరబోయే సంఘటనలు ఈ ఎన్నికలలో జరుగుతున్నాయి.
*** ఉపాధ్యాయులు ఓట్లు అమ్ముకోవడమా?
మనందరం తల్లీ, తండ్రి తరువాత మనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడినే స్మరించుకుంటూ ఉంటాం. వారు కనిపిస్తే పాదాభివందనం చేస్తూ ఉంటాం. అటువంటి ఉపాధ్యాయుల్లో కొందరు ఈ ఎన్నికల్లో తమ ఓటును అమ్ముకున్నారంటే నమ్మలేకపోతున్నాం. వాస్తవానికి గతంలో బ్రతకలేక బడిపంతులు అనేవారు. పూర్వం అయ్యవార్లకు వచ్చే జీతం వారి జీవనానికి సరిపోయేది కాదు. అయినా ఆనాడు ఉపాధ్యాయులు పస్తులుండి ఈ దేశానికి ఎంతో మంది మేధావులును సమాజానికి అందించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో చాలా మంది నెలకు లక్ష రూపాయల వరకు జీతంగా పొందుతున్నారు. మిగిలిన ఉద్యోగుల కన్నా ఉపాధ్యాయులు ఎక్కువ సౌకర్యాలు పొందుతున్నారు.
*** పోస్టల్ బ్యాలెట్‌కు విలువ కట్టారు.
గత మూడు రోజుల నుండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు పడిన ఉపాద్యాయులు, ఉద్యోగులు తాము పని చేసే ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ఓటును రెండు వేల నుండి నాలుగు వేల వరకు బేరం పెట్టి అమ్ముకున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటు వేసి నడిబజారులో తమ ఓటు హక్కును కాల రాసి ప్రజాసౌమ్యాన్ని ఖూనీ చేశారు. ఉద్యోగస్థుల్లో ప్రతినిత్యం అవినీతికి పాల్పడుతున్న కొందరు ఈ ఎన్నికల్లోనూ తమ గడ్డి తినే బుద్దిని బయటకు తీసి తమ ఓట్లను బహిరంగంగా అమ్మేశారు. అయితే ఈ దేశానికి భావిభారత పౌరులను అందించాల్సిన ఉపాధ్యాయుల్లో చాలా మంది తమ ఓటును అమ్ముకోవడం శోచనీయం. ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా అసహ్యం వ్యక్తమవుతోంది. వీరిపై ఇప్పటికే ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పోస్టల్ బ్యాలెట్‌ను అమ్ముకున్న వారిపై ఆరాలు ప్రారంభించారు. పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ వద్ద డబ్బులు తీసుకున్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. తాము ఎన్నికైన అనంతరం ఇటువంటి వెధవల పనిపట్టాలని వారి నుండి వంద రెట్లు అధికంగా వసూలు చేయాలని అభ్యర్ధులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ పోస్టల్ బ్యాలెట్ల విధానంలో మార్పులు తేవలసిన అవసరం ఉంది. అది పొందిన వారు వాటిని అమ్ముకోకుండా నిఘా పెట్టవలసిన అవసరం ఎన్నికల కమీషన్‌పై ఉంది. —కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్టు.
గమనిక: కేవలం పోస్టల్ బ్యాలెట్‌ను అమ్మకానికి పెట్టిన వారిని ఉద్దేశించి మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావిచడం జరిగింది. డబ్బులు ఆశించకుండా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు.