DailyDose

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్య-04/09

indian stock market crash

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒంటి గంట సమయానికి సెన్సెక్స్‌ 61 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్ల నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 69.58 గా ఉంది.
*వాంటా బయోసైన్స్‌ అనుబంధ కంపెనీ వయమ్‌ రీసెర్చ్‌ సొల్యూషన్స్‌ పూనెకు చెందిన ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌కు కాంట్రాక్టు పరిశోధనా సేవలు అందించనుంది.
*రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) దివాలా పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తెలిపింది.
*యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ హైదరాబాద్‌లో తన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
*హైదరాబాద్‌లో మాదాపూర్‌లోని సైబర్‌ గేట్‌వే కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సేవల సంస్థ విష్‌వర్క్స్‌ ఐటీ కన్సల్టింగ్‌ను ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కొనుగోలు చేయనుంది. ముందుగా ఈ సంస్థలో 53 శాతం వాటాను ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ సొంతం చేసుకుంటుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత జీడీపీ వృద్ధి స్వల్పంగా పెరిగి 7.5 శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో డ్రోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు డ్రోన్‌ పైలట్‌లుగా శిక్షణ ఇచ్చి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పేర్కొన్నారు.
*ఒక బ్యాంకుగా మారాలన్న లక్ష్యం దిశగా ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ మరో అడుగు ముందుకు వేసింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. ప్రతిపాదిత విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు శుక్రవారం అంగీకరించడంతో.. ఇక ఆర్‌బీఐ అనుమతే మిగిలింది. అది కాస్తా జరిగితే ఎన్‌బీఎఫ్‌సీలు మరిన్ని చిన్న బ్యాంకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది.
*సూచీలు డీలా పడ్డాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో చివరకు నష్టాలను నమోదు చేశాయి. కార్పొరేట్‌ కంపెనీల ఫలితాల సీజన్‌ కావడంతోపాటు ఈ నెల 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు మొదలు కానున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వాహన విక్రయాలు స్తబ్దుగా నమోదు కావొచ్చని భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) అంచనా వేస్తోంది.