Kids

ఉడతలు మరిచిపోయిన ఆహారమే మహావృక్షాలుగా ఎదుగుతున్నాయి

how squirrels make huge trees

అదొక దట్టమైన అడవి. నిండుగా చెట్లతో పాటు జంతువులు కూడా హాయిగా జీవిస్తుండేవి. నందనవనంలా ఉన్న ఆ అడవికి వనదేవత అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. రామునికి సాయం చేసి మన్ననలను పొందిన ఉడుతలంటే వనదేవతకు వల్లమానిన అభిమానం. ఆ అభిమానంతో ఉడుతలను ప్రత్యేకంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుండేది. వనదేవత పలకరింపులతో ఉడుతలు ఒకింత గర్వాన్ని పెంచుకున్నాయి. మిగిలిన జంతువులు కూడా గౌరవించడంతో లెక్కకు మించిన ఉడుతలు అడవిలో హాయిగా తమకు నచ్చిన రీతిలో తిరుగుతుండేవి. హఠాత్తుగా వచ్చిన తుఫానుకి అడవిలో ఎక్కువ చెట్లు కూలిపోయాయి. అడవి పలచబడింది. జంతువులకు, పక్షులకు ఆహారసమస్య ఎదురయ్యింది. అందుబాటులో ఉన్న ఆహారాన్ని అందరూ సమానంగా వినియోగించుకుందాం అని అన్నీ కలిసి అనుకున్నాయి. కానీ అడవిలో తమకు తిరుగేలేదనుకున్న ఉడుతలు రేయింబవళ్లు అదేపనిగా, ఉన్న చెట్లలో కాయలు తిని మిగతావి స్వార్థబుద్ధితో దాచుకోవడం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఎవరికి అనుమానం రాకుండా భూమిలో చిన్న చిన్న గోతులు తీసి అందులోనే కాయల్ని ఉంచి మట్టి కప్పివేయడం దినచర్యగా మార్చుకున్నాయి. ఎప్పటి ఆహారం అప్పుడు తిందామన్న మిగిలిన చిన్న జంతువులకు, పక్షులకు ఆహార సంపాదన విషయంలో నిరాశే ఎదురయ్యింది. ఉడుతలు దాచుకున్న ఆహారాన్ని ఇవ్వమని ప్రాధేయపడి అడిగాయి. మా దగ్గర ఎటువంటి ఆహార నిల్వలు లేవని కరాఖండీగా చెప్పాయి ఉడుతలు. విహారానికి వచ్చిన వనదేవతకి ఆహార సమస్యను చెప్పుకొని ఉడుతల స్వార్థబుద్ధిని వివరించాయి పక్షులు, చిన్న జంతువులు. ఉడుతలను నిజానిజాలను అడిగింది వనదేవత. ‘అదేమో మాకు తెలియదు’ అబద్ధాన్ని అందంగా చెప్పింది ఓ ఉడుత. దివ్యదృష్టితో అంతా గమనించిన వనదేవత ‘తథాస్తు!’ అంటూ మాయమైంది. అప్పటి నుంచి స్వార్థం కొద్ది దాచుకున్న ఆహారం మరచిపోవడం ఉడుతలకు పరిపాటైంది. అలా మరచిపోయిన ఆహార సంపద భూమి నుంచి మొక్కలుగా మొలచి మహా వృక్షాలుగా వృద్ధి చెందుతున్నాయి. అబద్ధానికి శిక్ష, ఉడుత మతిమరుపుకి కారణమైంది. ఆ మతిమరుపు ప్రకృతిలో వృక్షసంపద పెరగడానికి వరమైంది. పెరుగుతున్న వృక్ష సంపద ప్రకృతిలో సంచరిస్తున్న చిన్న జంతువులకు, పక్షులకు ఆహారసమస్య తీర్చే అక్షయపాత్రగా మారింది.