Business

రేపు జెట్ పైలట్ల బంద్ పిలుపు

1100 jet airways pilot to go on strike

జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 1,100 మంది పైలట్లు సోమవారం ఉదయం 10 గంటల నుంచి విధులకు దూరంగా ఉండనున్నారు. ‘పైలట్స్‌ బాడీ నేషనల్‌ ఏవియేటర్‌ గిల్డ్‌’ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. నేటి వరకు పైలట్స్‌, ఇంజినీర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులకు జీతాలు అందలేదు. జనవరి నుంచి వీరికి జీతాలు బకాయి ఉన్నారు. ఇతర కేటగిరి ఉద్యోగులకు కూడా మార్చి జీతాలను చెల్లించలేదు. ‘‘నేటితో కలిపి మూడున్నర నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే మేము ఏప్రిల్‌ 15 నుంచి విధులకు దూరంగా ఉంటున్నాం. ఎన్‌ఏజీలోని 1,100 మంది పైలట్లు 10 గంటల నుంచి విమానాలను నడపరు.’’ అని గిల్డ్‌ వర్గాలు వెల్లడించాయి. జెట్‌ సంస్థలోని మొత్తం 1,600 మంది పైలట్లలో దాదాపు 1,100 మంది ఎన్‌ఏజీలో సభ్యులు. జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతలను ఇప్పుడు ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం చూస్తున్న విషయం తెలిసిందే. నేడు ఈ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజశ్రీ పతి తన పదవి నుంచి వైదొలగారు. ఆయన రాజీనామా ఏప్రిల్‌ 13 నుంచే అమల్లోకి రానుంది.