ఎన్నికల సంఘం తీరు అనుమానంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రతిపక్షాల సమావేశానికి హాజరైన ఆయన… ఈవీఎంలో లోపాలు, ఎన్నికల సంఘం తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేసి… 25 లక్షల ఓట్లు తొలగించారని దుయ్యబట్టారు. తర్వాత క్షమాపణలు చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు. ఏ పార్టీలకు తెలియకుండానే ఒప్పంద సిబ్బందికి ఈవీఎంల నిర్వహణ అప్పగించడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా జరిగితే బాధ్యత వహిస్తారా అని ఈసీని నిలదీశారు. అందుకే నమ్మకమైన బ్యాలెట్ ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశం కోసం నా పోరాటం…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాయని… ఇప్పుడు దేశం కోసమే తన పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. రకరకాల మార్గాల్లో ఈవీఎంలను ప్రభావితం చేయవచ్చని… అందుకే ప్రపంచంలో చాలా దేశాలు ఈవీఎంలు వాడటం లేదని గుర్తు చేశారు. ఏపీలో 20 నుంచి 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని… ఈసీ తీరుపై మహిళలు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. విజయం మాదే…ఏపీ ఎన్నికల్లో వంద శాతం తప్పక విజయం సాధిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనేదే తమ అభ్యంతరమని చంద్రబాబు తేల్చి చెప్పారు. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే… ఎన్నికల సంఘం విశ్వాసం కోల్పోయిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 22 రాజకీయ పార్టీలు పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలని కోరామన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్స్ లెక్కించి ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ విపక్ష పార్టీలపై అధికార పక్షం దాడులు చేయించిందని చంద్రబాబు దుయ్యబట్టారు. సీబీఐ,ఈడీ, ఆదాయపన్ను శాఖ ద్వారా నేతలపై దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కన్నెత్తి చూడని ఎన్నికల సంఘం తమ సందేహాలకు ఏం సమాధానం చెబుతుందన్నారు చంద్రబాబు.
ఎన్నికల సంఘం వ్యవహరించే తీరు అనుమానస్పదంగా ఉంది
Related tags :