Politics

షోలాపూర్‌లో తెలుగు ఓటర్ల డామినేషన్

solapur telugu voters dominate in local elections

మహారాష్ట్రలోని షోలాపూర్ పట్టణం నడిబొడ్డున ‘పద్మ చిత్ర మందిర్’ అని ఓ సినిమా థియేటర్ ఉంటుంది. కొత్తగా తెలుగు సినిమా రిలీజైతే చాలు ఇక్కడ షో పడాల్సిందే. ఇక్కడ తెలుగోళ్ల డామినేషన్ ఎక్కువ అనడానికి ఇదో చిన్న ఉదాహరణ. షోలాపూర్లో ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తి కూడా మనవాళ్లకు ఉంది.
**175 ఏళ్ల కిందట
తెలంగాణ, కర్నాటకకు చెందిన వలస ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. కర్నాటక వాళ్లు తక్కువగానే ఉన్నా,తెలుగోళ్లు మాత్రం 3 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. ఇందులో 70 శాతం మంది పద్మశాలీలే. దాదాపు 175 ఏళ్ల కిందటే తెలంగాణ నుంచి షోలాపూర్ కు ప్రజలు వలస వచ్చారు. షోలాపూర్ తోపాటు నాందేడ్, జల్నా, పుణె, బివండీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీలు ఉండటంతో మిల్లులు, హ్యాండ్లూమ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కొందరు పవర్ లూమ్స్, రెడీమేడ్ గార్మెంట్స్, బీడీ పనుల్లోకి వెళ్లారు. ఇక్కడ తెలుగు మాట్లాడేవారు, తెలుగు వంటలు, తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చాలా కామన్. అయితే తెలుగు స్కూళ్లు లేకపోవడంతో మన భాష మాట్లాడేవారిలోచాలామందికి తెలుగు రాయడం రాదు.
**గతంలో ముగ్గురు ఎంపీలు
తెలుగు మాట్లాడే వాళ్లు షోలాపూర్ లో గణనీయంగా ఉన్నారని పద్మశాలి జాతి సంస్థ నేత అశోక్ ఇందాపూర్ చెప్పారు. తెలుగు మాట్లాడే ముగ్గురు వ్యక్తులు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారని తెలిపారు. గతంలో పద్మశాలీలు కాంగ్రెస్ కు ఓటేసే వారని, ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నారని వెల్లడించారు.అయితే ఇక్కడి బీడీ వర్కర్లలో సీపీఎంకు మంచి ఫాలోయింగ్ ఉందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీనేత నర్సయ్య ఆడం ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని వివరించారు.
**షిండే వర్సస్ అంబేడ్కర్
ఎస్సీకి రిజర్వ్ అయిన షోలాపూర్ సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేత, హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.బీజేపీ నుంచి జై సిద్ధేశ్వర్ శివా చార్య స్వామి, వంచిత్ బహుజన్ అఘాడీ నుంచి బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లోబీజేపీ అభ్యర్థి గెలవగా, ఈసారి ఎలాగైనా గెలవాలని సుశీల్ కుమార్ షిండే ప్రయత్నిస్తున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని చెబుతూ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన, తెలంగాణ వలస ప్రజలు ఈ సారి ఎవరికి పట్టం గడుతారో??