WorldWonders

అక్కడ పెళ్లికి మంగళసూత్రం అక్కర్లేదు

tamilnadu chikkedikuppam wedding without knot

పెళ్లంటే నూరేండ్ల పంట అంటారు. అటువంటి పెండ్లి తంతు దేశం, ప్రాంతం, ఆచార వ్యవహారాలను బట్టి మారుతూ ఒక్కో మతంలో ఒక్కో విధంగా ఉంటుంది పెండ్లి తంతు. ఆ తంతు ప్రకారం వివాహాలు జరుపడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటాయి. అయితే తమిళనాడులోని చిక్కెడికుప్పంతోపాటు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో జరిగే పెండ్లిళ్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ విధానంలో మంగళసూత్ర ధారణ ఉండదు. పెండ్లికి కావాల్సింది ఆడంబరాలు కాదు, అన్యోన్యతే నని ఆత్మగౌరవ పెండ్లిళ్లు చేసుకున్న వారు నిరూపిస్తున్నారు. అక్కడి సంప్రదాయంలో మంచి ముహూర్తాలేమీ ఉండవు. పురోహితులు, పెండ్లి సందర్భంగా వేదికను ఆర్భాటంగా అలంకరించడం కానీ, ఊరేగింపుగా వెళ్లడం కానీ ఉండవు. విందూవినోదాల ప్రస్తావనే కనిపించదు. ఇష్టపడిన అమ్మాయి, అబ్బాయి మనసులోని మాట పెద్దలకు చెబుతారు. అందరూ అశుభ దినంగా భావించే ఒక తేదీనే మంచి ముహూర్తంగా భావిస్తారు. ఆ రోజు బంధుమిత్రుల సమక్షంలో వధువు, వరుడు దండలు లేదా ఉంగరాలు దండలు మార్చుకుంటారు. మంత్రాల ప్రసక్తి గానీ పెండ్లి భాజాల సందడి ఏమీ ఉండవు. వివాహ ఒప్పందం పై అమ్మాయి, అబ్బాయి సంతకాలు పెట్టి, పరస్పరం మార్చుకుంటారు. అంతే ఇక పెండ్లి తంతు పూర్తయినట్లే. చిక్కెడికుప్పం గ్రామంలో ఇలాంటి వివాహాలే జరుగుతాయి. ద్రవిడ సంప్రదాయం ప్రకారం ఈ వివాహాలు జరుగుతాయి. ఈ వివాహాలను ఆత్మగౌరవ పెండ్లిళ్లు అని అంటారు. విల్లుపురం, చిక్కెడికుప్పం గ్రామాల్లో ప్రజలే కాదు ఆ ప్రాంతంలో ఉన్న కొట్టపుండి, కొట్టుగంకుప్పం, అతియంతల్, కోవిల్‌పురైయూర్ గ్రామాల్లో ఈ రకమైన వివాహాలు జరుగుతుంటాయి. మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగితేనే వివాహం కాదు. అవేమీ లేకుండా చేసుకున్నా వివాహమేనని హేతువాది, ద్రవిడ కజగమ్ వ్యవస్థాపకుడు పెరియార్ వెంకటస్వామి నమ్మాడు. ఆయన నమ్మిన ద్రవిడ పద్ధతిలోనే ఆత్మగౌరవ పెండ్లిళ్లు జరిపించేందుకు శ్రీకారం చుట్టాడు. ఆయన చూపిన బాటలోనే ఇప్పటివరకూ వెయ్యి జంటలు ఈ తరహా పెండ్లిళ్లు చేసుకొని ఆనందంగా జీవిస్తున్నాయి. ఇక్కడ బయటి సంబంధాలు తక్కువే. ఒకవేళ బయటి వారెవరైనా వీరితో కలవాలనుకుంటే స్థానిక వివాహ సంప్రదాయాన్ని పాటించాల్సిందే. ఈ కుటుంబాల్లో భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటారు. కులం లేదు కాబట్టి కుల వివక్షకు తావే ఉండదు. అంతేకాదు నువ్వు ఎక్కువ, నేను తక్కువ అనేటటువంటి లింగవివక్ష అసలే లేదు. కుటుంబంలో ఆడ, మగ, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ శిలంబం అనే యుద్ధకళలో శిక్షణ పొందుతారు. వీరి పిల్లలకు ఏ దేవుని పేరో, దేవత పేరో పెట్టరు. వారి పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల అన్యోన్యతే వివాహబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని చిక్కెడికుప్పం గ్రామస్తులు చెబుతున్నారు. అందుకోసమే అక్కడి వారంతా తాళిని నిషేధించారు. సాధారణ వివాహాల్లో కనిపించే తంతులు, ఆడంబరాలు, విందులు, వినోదాలు వీళ్ల వివాహాల్లో ఉండవు. అందుకే ఈ గ్రామంలో పైండ్లెన మహిళల మెడలో తాళి కానీ, కాళ్లకు మెట్టెలు కానీ కనిపించవు. అంతేకాదు మగాళ్లెవరూ వరకట్నం కూడా అడగరు. కుల పట్టింపులు అసలే ఉండవు. గత 50 యేండ్లుగా ఇక్కడివారికి వరకట్నం అన్న మాటే తెలియదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇదే సంప్రదాయాన్ని చుట్టుపక్కల కొట్టపుండి, కొట్టుగంకుప్పం, అతియంతల్, కోవిల్‌పురైయూర్ గ్రామాల వాళ్లు కూడా అనుసరిస్తుంటారు. పెరియార్ ద్రవిడ సిద్ధాంత స్ఫూర్తితో జరుగుతాయి. తాళి లేని పెళ్లి సంప్రదాయం చిక్కెడికుప్పంలో 1960లో ప్రారంభమయింది. ఆ గ్రామం ఒకప్పుడు తాగుబోతులకు నిలయంగా ఉండేది. మద్యం రక్కసి వల్ల ఎంతోమంది మహిళలు భర్తలను కోల్పోయారు. మద్యం మహమ్మారి నుంచి బయటపడేదెలా.. ఈ వ్యసనంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న మగవారిని రక్షించుకోవడమెలా? అని గ్రామంలోని పెద్దలమంతా బాధపడేవాళ్లు. ఈ క్రమంలో ప్రముఖ హేతువాది పెరియార్ ప్రసంగం ఆ గ్రామస్తుల జీవితాల్ని మార్చేసింది. ఆయన సిద్ధాంతంతో ప్రభావితులైన వారంతా, కుల వివక్ష, లింగ అసమానతలకు దూరంగా, స్వీయ క్రమశిక్షణతో జీవించాలని సంకల్పానికి కట్టుబడి ఉన్నారు. అదే ఒరవడితో ఇన్నాళ్లూ కొనసాగుతున్నారు.తొలిసారి ఆత్మగౌరవ పెండ్లి చేసుకున్న అర్జునన్, తనివరసు దంపతులిద్దరూ హాయిగా తమ వైవాహిక జీవితాన్ని గడిపామని, తమకు మంగళసూత్రం లేకుండానే వివాహం జరిగినా, ఎటువంటి సమస్యలు లేకుండా మంచిగానే బతుకుతున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం తాము కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాండ్లతో ఆనందంగా ఉన్నామని అర్జునన్ పేర్కొన్నారు. తన కొడుక్కి పెరియార్ అని నామకరణం చేశానని, అతను ప్రస్తుతం ఈవి రామస్వామి పేరుతో ఓ పాఠశాలను నడుపుతున్నాడని అన్నారు.