Movies

శ్రీరెడ్డి ఫిర్యాదులపై తెలంగాణా జీవో

jhansi supriya nandini reddy appointed as panel on srireddy allegations

శ్రీరెడ్డి ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. జీవో జారీ. టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి కొన్నాళ్ల క్రితం చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్యానల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ప్యానల్ ఏర్పాటుకు సంబంధించి జీవోను విడుదల చేసింది. జీవో నంబర్ 984 ప్రకారం.. సినీ నటి సుప్రియ, సినీ నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలో టాలీవుడ్‌ ప్రతినిధులుగా నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. రాంమోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.