Health

లూపస్ అంటువ్యాధి కాదు

lupus is not contagious

లూపస్‌ లేదా ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ అరిథమెటోసిస్‌) అనే ఈ వ్యాధి ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తి రోగిపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. మనందరిలో ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది బయటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. జన్యులోపాల వంటి ఏవైనా కారణాల వల్ల మన వ్యాధి నిరోధక శక్తి… మన శత్రుకణాలను తుదముట్టించడానికి బదులుగా, మన సొంతకణాలనే మన శత్రువులుగా పరిగణించి, వాటిపై దాడి చేస్తుంది. దాంతో కంచే చేను మేసినట్టుగా మన సొంత అవయవాలే మన వ్యాధి నిరోధకశక్తి బారిన పడతాయి. అందువల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో ఒకరి నుంచి 15 మంది వరకు ఈ జబ్బు వస్తుంటుంది. సాధారణంగా 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి ఇది అంటుకోదు. కాబట్టి ఈ జబ్బు ఉన్నవారితో సన్నిహితంగా మెలగడం వల్ల, సహజీవనం చేయడం వల్ల ఈ వ్యాధి సోకదు. ఇలాంటి వ్యాధిగ్రస్తులను వెలివేయనక్కర్లేదు. పైపెచ్చు వారి పట్ల మరింత ప్రేమ, ఆదరణ చూపించడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యం పెరుగుతుంది. అలా వ్యాధి తీవ్రతను కూడా తగ్గించవచ్చు. ఈ జబ్బు లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే ఒకే రోగిలో కూడా తరచూ లక్షణాలు మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే వ్యాధి ఉండవచ్చు. మరికొన్నిసార్లు చాలా తీవ్రరూపంలో లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధిని తొలిదశలో అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ రోగులు సూర్యరశ్మికి అతి సున్నితంగా ఉంటారు. ఎండబారిన పడ్డప్పుడు ఒంటిమీద ర్యాష్, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. వివిధ రకాలైన మచ్చలు, దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నోటిలో పూత, జుట్టు ఎక్కువగా రాలడం, కీళ్లనొప్పుల వంటివి ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత వల్ల కొందరిలో ఒక్కోసారి యుక్తవయసులోనే పక్షవాతం, గుండెపోటు, బుద్ధిమందగించడం వంటి విపరీత లక్షణాలు కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపుపోవడం, తరచూ ఫిట్స్‌రావడం, రక్తహీనత, తెల్లరక్తకణాలు–ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం కూడా సంభవించవచ్చు. గుండె మీద, ఊపిరితిత్తుల మీద పొర ఏర్పడి, చుట్టూ నీరు చేరడం కూడా జరగవచ్చు. మహిళల్లో తరచూ గర్భస్రావాలు జరగడానికి కూడా లూపస్‌ ఒక కారణం. ఈ వ్యాధి ప్రభావం మూత్రపిండాలపై పడినప్పుడు ఒళ్లంతా వాపు, బీపీ పెరగడం, మూత్రం నుంచి ఎక్కువగా ప్రోటీన్‌ పోవడం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఏ అవయవమైనా ఈ వ్యాధి బారిన పడవచ్చు. పై అవయవాలు ప్రభావితం అయినప్పుడు… వాటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఎన్ని రకాల యాంటీబయాటిక్స్‌ వాడినా ప్రయోజనం ఉండక, స్టెరాయిడ్స్‌ అనే మందులు వాడినప్పుడు ఉపశమనం కలుగుతుంటే… లూపస్‌ వ్యాధిని గుర్తించడానికి అది మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఇలాంటి రోగులను వెంటనే రుమటాలజిస్టులకు చూపించాలి. వ్యాధి నిర్ధారణ చేసి, వారి ఆధ్వర్యంలో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.