NRI-NRT

వైభవంగా టాంటెక్స్ ఉగాది వేడుకలు

tantex ugadi 2019 in texas

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), యూలెస్ లోని ట్రినిటి హైస్కూల్ లో వసంత కోయిల తీయని రాగాన్ని ఆలపించగా వికారి నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, కనువిందైన అలంకరణలతో మన తెలుగువారి ఆటపాటల నడుమ ఏప్రిల్ 16, 2019 న టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మరియు ఈ కార్యక్రమ సమన్వయకర్త సతీష్ బండారు మరియు మల్లిక్ కొండా ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త కళ్యాణి తాడిమేటి పర్యవేక్షణలో ఉగాది ఉత్సవాలు ఆనంద డోలికల్లో ఊయలలూగించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విచ్చేసిన రఘు వేముల తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. షడ్రుచుల ఉగాది పచ్చడిని, తేనీరు, అల్పాహారంతో కనువిందైన కమ్మని ఫలాలను, ఘుమఘుమలాడే పసందైన భోజనాన్ని స్థానిక “ప్రసూనాస్ కిచెన్” వారు వడ్డించి ‘భళా ప్రసూనాస్’ అనిపించుకున్నారు. ఈ ఉగాది పర్వదినోత్సవానికి చాలా మంది తెలుగువారు హాజరు కాగా సుమారు 150కి పైగా పిల్లలు మరియు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని దొరకునా ఇటువంటి కళాసౌరాభం అన్నవిధంగా అందరినీ అలరించారు.  ఈ ఉగాది ఉత్సవాలు “అమెరికా జాతీయ గీతంతో” ప్రారంభమై తదుపరి స్వప్న చకోటి శిష్యులు చేసిన “గణపతి వందనం” నృత్యం, గుడిమెల్ల స్వప్న శిష్యుల ” గణేశా పంచరత్నం” నృత్యం మరియు “ఉగాది బొనాంజా” మెడ్లీ , సుమలత శిష్యుల F3 సందడి, సాక్షి శ్రీవాత్సవ శిష్యుల చేసిన “అల్లు అర్జున్” మెడ్లీ , అపర్ణ వేముల బృందం పాడిన శాస్త్రీయ గీతం, కళ్యాణి ఆవుల శిష్య బృందం చేసిన ” చెవులార విందు” ఫొక్ సాంగ్ నాట్యం, ప్రభల శ్రీనివాస్ రచించి రూపొందించిన “ఆనంద విలాసం” నాటిక, శాంతి నూతి మరియు శిష్యబృందం ప్రదర్శించిన ” రంగస్థలం” మూవీ ప్లే, లక్ష్మణ్ శిష్యులు చేసిన “క్లాస్ గొప్ప లేక మాస్ గొప్ప”నృత్యాలు ఇలా మరెన్నెన్నో ప్రదర్శనలు టాంటెక్స్ ఉగాది వేదికను ఇంద్రభవనమును తలపింపచేస్తూ, కనురెప్పకి పని చెప్పకుండా మంత్రముగ్ధులను చేస్తూ ప్రేక్షకులను మైమరపించాయి. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, వికారి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో కార్యవర్గ సభ్యులందరి సంపూర్ణ సహకారంతో, 2019వ సంవత్సరంలో “ప్రగతి పథంలో దశాంశ సూత్రాలు” గమ్యంగా, సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మనసభ్యుల అవసరాలకు అనుగుణంగా మన సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుతున్నాము అని వివరించారు. కార్యక్రమాల నాణ్యత పెంచడం కోసం ఈ ఉగాదికి ప్రత్యేకంగా స్థానిక కార్యక్రమాలు, విందు భోజనం, అనంతరం సుమంగళి మరియు నరేంద్రల బృందంతో కచేరిని, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్ హాస్య భరితమైన ప్రదర్శన ఏర్పాటు చేసాము. సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఉచిత సినిమా ప్రదర్శన, పన్నులు చెల్లించడానికి అవసరమైన మెళుకవలు, జాగ్రత్తలు, ఫైనాన్స్ ప్లానింగ్,క్రీడా రంగంలో వాలిబాల్, టేబుల్ టెన్నిస్, ఆరోగ్య పరంగా CPR training, సాంకేతిక పరంగా “Machine Learning – A Lightning Boot camp” వంటి కార్య క్రమాలను నిర్వహించడం జరిగింది, సభ్యులనుంచి మంచి స్పందన రావడం జరిగిందని తెలియజేశారు. మునుముందు పెద్దలకు ఆరోగ్య అవగాహన, మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలను, పిల్లలకు కళాశాలల ఎంపిక, ధరఖాస్తులను ఎలా చేయాలి అనే అంశాలపై కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు సిద్దం అవుతున్నాయని తెలియజేశారు. ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2019 “ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజ సేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో కిరణ్ ప్రభకి, సంగీతం రంగంలో శ్రీనివాస్ ప్రభలకి, నాట్యం రంగంలో శ్రీలత సూరి కి, సమాజ సేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపుకి, సాంకేతిక రంగంలో డా.సాంబారెడ్డికి, వైద్యరంగంలో డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, డా.కోసూరి రాజుకి ఈ పురస్కారాలను అందచేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేముల లకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) ’ పురస్కారంతో సత్కరించి వారి సేవా ధృక్పదాన్ని పలువురికి చాటారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూప్ర్నింటెండెంట్ డా. స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు, తరువాత డా. స్టీవ్ చాప్మన్ ను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంను ఉచితంగా ఇప్పించిన డా. తోటకూర ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విచ్చేసిన కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్, వ్యాఖ్యాత రఘు వేముల లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు. వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయకర్త సతీష్ బండారు ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ప్రెజెంటింగ్ , ఈవెంట్ పోషక దాతలకి కృతఙ్ఞతలు తెలియచేసారు. తమ ప్రతిభతో సభాప్రాంగణానికి కొత్త అందాలు తెచ్చిన ‘స్పార్కల్స్” మరియు టిక్కెట్ల అమ్మకంలో కీలకపాత్ర పోషించిన మైడీల్స్ హబ్.కాం వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.ఎంతో కృషి, సమయం వెచ్చించిన కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సం యుక్త కార్తదర్శి ప్రబంధ్ తోపుడుర్తి, కోశాధికారి శరత్ యర్రం, శ్రీకాంత్ జొన్నల, సతిష్ బండారు, యన్.యం.స్ రెడ్డి, పవన్ రాజ్ నెల్లుట్ల, ఉపాధ్యక్షులు లక్ష్మి పాలేటి మరియు టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, వివిధ నామినేషన్ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెరపడినది.

TANTEX Ugadi Utsavaalu 2019

TANTEX Ugadi Utsavaalu 2019