Business

ఊబర్‌లోకి భారీగా టయోటా పెట్టుబడులు

toyota invests billion dollars in uber

క్యాబ్‌ సేవల దిగ్గజం ఉబర్‌లోకి బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. జపాన్‌కు చెందిన టొయోటా, సాఫ్ట్‌ బ్యాంక్‌, డెన్సోలు కలిసి సంయుక్తంగా బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి. ఈ పెట్టుబడులను ఉబర్‌ సాంకేతిక విభాగానికి మళ్లించనున్నారు. టొయోటా మోటోకార్ప్‌, డెన్సోలు కలిసి 667 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టగా.. మిగిలిన 333 మిలియన్‌ డాలర్లను సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన విజన్‌ ఫండ్‌ సమకూర్చింది. ఉబర్‌ ఇటీవల స్థాపించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ యూనిట్‌కు ఈ నిధులను మళ్లిస్తారు. వచ్చే మూడేళ్లలో మరో 300 మిలియన్‌ డాలర్లను సమకూర్చనున్నట్లు టొయోటా వెల్లడించింది. స్వయంచాలిత వాహనాల అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది. టొయోటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షిగెకి టొమోయమ మాట్లాడుతూ ‘సమష్టిగా పనిచేయడం వల్ల పరిశోధనల ఖర్చు తగ్గడంతో పాటు వేగంగా ఫలితాలను సాధించవచ్చు’ అని పేర్కొన్నారు. ‘మాకు తెలిసినంత వరకు ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీని రవాణ రంగాన్ని సమూలంగా మార్చివేస్తుంది. మన వీధులను మరింత సురక్షితంగా మార్చివేస్తుంది.’ అని ఉబర్‌ సీఈవో దారా ఖస్రో షాహి తెలిపారు.