Videos

నేను కర్రసాము చేస్తే…

harbhajan singh feat with sticks

వయసు మీద పడుతున్నా.. అంచనాలకు మించి ఆడుతున్న ఆటగాళ్లలో హర్భజన్‌సింగ్‌ ఒకడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఆడుతున్న భజ్జీ తన ఆఫ్‌బ్రేక్‌ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. మైదానంలో రాణించడంతో పాటు మైదానం వెలుపల సైతం సందడి చేస్తున్నాడు. ‘లోకల్‌ నింజా ఛాలెంజ్‌’ పేరుతో సీఎస్కే యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమం కోసం జరిగిన ఓ షూట్‌లో చెన్నై ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆ ఛాలెంజ్‌లో భాగంగా కర్రసాము చేయాల్సి ఉండగా జట్టు సభ్యులు ఇబ్బంది పడ్డారు. అయితే, టర్బోనేటర్‌ మాత్రం ఏకంగా రెండు కర్రలు పట్టుకొని గిర్రుమని తిప్పాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై స్పందించిన శిఖర్‌ దావన్‌.. ‘వాహ్‌ పాజీ, మజా ఆగయా’ అని పేర్కొన్నాడు. హర్భజన్‌ భార్య గీతా బస్రా సైతం భజ్జీ వీడియోపై స్పందించింది. ‘మీరు కర్రసాము చేయగలరని మాకు ఇంతవరకూ తెలియనే తెలియదు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఛాలెంజ్‌లో హర్భజన్‌తో పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సామ్‌ బిల్లింగ్స్‌, దీపక్‌ చాహర్‌, శాంట్నర్‌, మోహిత్‌శర్మ, అంబటి రాయుడు, శార్ధుల్‌ ఠాకూర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియోను ఐపీఎల్‌ యాజమాన్యం సైతం తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. భజ్జీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి చెన్నై తొలి విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, భజ్జీకి గత మూడు మ్యాచుల్లోనూ జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఈ రోజు రాత్రి 8 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో చెన్నై తలపడనుంది.