Fashion

హైదరాబాద్‌లో ఇప్పుడు నయా ఫ్యాషన్ – సహజీవనం

living relationships on the rise in hyderabad

‘నా వద్దకు 28 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. చాలాసేపటికి కానీ మాట్లాడలేకపోయాడు. తనకు నిద్రమాత్రలు రాయమని కోరాడు. మాటల్లో పెట్టి సంగతేమిటంటూ అడిగితే విషయం బయటపెట్టాడు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి ఉన్నత విద్య పూర్తిచేసి ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తాను పనిచేసే చోట పరిచయమైన ఓ యువతితో చనువు ఏర్పడింది. అలా క్రమంగా తన గదిని ఖాళీ చేసి ఆమె అపార్ట్‌మెంట్‌కు మారాడు. అంతకుముందు మరో యువకుడితో ఆమె సహజీవనం చేసినట్టు కొద్దిరోజులకు అతడికి తెలిసింది. దీని గురించి అడిగితే మనస్పర్ధలు వస్తాయని వదిలేశాడు. మూడు నెలల తరువాత ఆమె ఇతడిని దూరంగా ఉంచడం ప్రారంభించింది. మరో ఇల్లు చూసుకోమని చెప్పింది. సున్నిత మనస్కుడైన అతడను మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఉద్యోగం పోగొట్టుకునేంత కుంగుబాటుకు చేరాడు’అంటూ.. కూకట్‌పల్లికి చెందిన మనస్తత్వ నిపుణులు వివరించారు. ‘ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. అద్దె కలసివస్తుందనే ఉద్దేశంతో ఒకేచోటుకు చేరారు. స్నేహితులు వారించినా.. మాటలు పెడచెవిన పెట్టారు. మనసులు కలిస్తే పెళ్లి చేసుకుంటాం.. లేకపోతే స్నేహితులుగా మిగిలి పోతామంటూ భారీ డైలాగులు కూడా చెప్పారు. కొద్దినెలలు సజావుగానే సహజీవనం సాగించారు. ఆ తరువాత ఇద్దరూ తాము పనిచేసే చోట మరొకరితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ యువకుడు నీతో కలసి ఉండలేనంటూ చెప్పేశాడు. ఇంతకాలం తనను మాయమాటలతో నమ్మించి మోసం చేశాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు ఇరువైపులా పెద్దల ఒప్పందంతో రాజీ కుదిరించా’మంటూ ఓ న్యాయవాది తన అనుభవాన్ని వివరించారు. కార్పొరేట్‌ కొలువులు… ఊహించని స్థాయిలో వేతనం.. కావాల్సినంత స్వేచ్ఛ.. కోరుకున్నది క్షణాల్లో కాళ్లముందు వాలిపోయే జీవితం.. ఇంతకుమించి ఇంకే కావాలి అనుకునే వయసు.. సజావుగా సాగాల్సిన జీవితంలోకి కోరి కష్టాలను ఆహ్వానిస్తున్నారు. సంకెళ్లుగా భావించే హద్దులను దాటి అధికశాతం యువత సహజీవనం వైపు అడుగులు వేస్తున్నారు. రెండేళ్లుగా ఈ సంస్కృతి మరింతగా పెరిగిందంటున్నారు సామాజికవేత్తలు. ముఖ్యంగా హైదరాబాద్‌లో దేశ, విదేశాల నుంచి వచ్చే యువతీ, యువకుల పరిచయాలు శృతి మించుతున్నట్లు చెబుతున్నారు. మూడుముళ్లు పడకుండానే కలసి నడుద్దామంటూ ఒకే ఇంట్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో స్నేహంగా మెలిగిన జంటలు.. క్రమంగా ప్రేమ పేరిట మరో అడుగు ముందుకేస్తున్నారు. నచ్చినంత వరకూ కలసి ఉందామనే ఒప్పందంతో ఆలుమగలుగా చెలామణీ అవుతున్నారు. ఇలాంటి జంటల్లో కొద్దిమంది మాత్రమే పెళ్లితో ఏకమవుతున్నారు. 70-80శాతం ప్రేమ.. పెళ్లి మధ్య ఊగిసలాటతో ఒత్తిడికి గురవుతున్నారు. తాము తప్పు చేసామని గుర్తించేలోపే కష్టాల్లో చిక్కుతున్నారు. దీంతో ఒకర్నొకరు వదిలించుకునే క్రమంలో శత్రువులుగా మారుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు విషప్రచారం చేసుకుంటూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసేంత వరకూ చేరుతున్నారు. దీంతో కుంగుబాటుకు గురైన అబ్బాయిలు.. అమ్మాయిలు కొందరు మత్తుపదార్థాలకు బానిసలవుతున్నారు. వీటినుంచి కౌన్సెలింగ్‌ ద్వారా బయటపడేందుకు మనస్తత్వ నిపుణులను ఆశ్రయిస్తున్నారు. చదువు.. ఉద్యోగ వేటలో నగరం చేరిన అధికశాతం యువతీ యువకులు కలసి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది మాదాపూర్‌లో ఓ ఇంటిని అబ్కారీ అధికారులు తనిఖీ చేశారు. ఆ ప్లాట్‌లో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు కలసి ఉంటున్నట్లు గుర్తించారు. పెరిగిన అద్దెలు, ఖర్చులను తగ్గించుకునేందుకు తాము ఒకేచోట ఉంటున్నట్లు వారు చెప్పారు. వీరిలో ఇద్దరు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కాగా మిగిలిన ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావటం విశేషం. తాము హద్దుల్లో ఉంటున్నామనే ఉద్దేశంతో యువతీ, యువకులు కలసి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా క్రమంగా సహజీవనం వైపు మళ్లుతున్నారు. కార్పొరేట్‌ కొలువుల్లో కుదురుకుంటున్న అధికశాతం ఈ తరహా జీవితాన్ని కోరుకుంటున్నారని మనస్తత్వ విశ్లేషకులు లలిత వివరించారు. తన వద్దకు కూడా నెలకు ఒకరిద్దరు ఆడపిల్లలు కౌన్సెలింగ్‌కు వస్తుంటారని తెలిపారు. తాము సహజీవనం చేస్తున్నామనే విషయాన్ని దాచిపెట్టి ప్రేమించుకుని విడిపోయినట్లు నమ్మిస్తున్నారు. హద్దులు దాటిన యువతలోనే ఎక్కువగా కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. కుటుంబానికి దూరంగా వచ్చిన యువతను మహానగరంలో గుర్తించేవారుండరు. తామేం చేసినా పసిగట్టే వాతావరణం లేదనే ధైర్యం దీనికి కారణమంటూ ఆమె విశ్లేషించారు. సున్నితమైన అంశం కావటంతో అధికశాతం యువత తాము నష్టపోయినా బయట పడలేకపోతున్నారు. అలా మౌనంగా వేదనను భరిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని సమయాల్లో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ వివరించారు.