Politics

మేధావులకు లేఖ రాస్త. ఢిల్లీలో ధర్నా చేస్తా.

chandrababu to protest in delhi for 50percent counting of vvpat slips

‘యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండుతో రాజకీయ పార్టీలతో కలిసి త్వరలోనే దేశ రాజధానిలో ధర్నా చేస్తాం’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘స్వచ్ఛంద సంస్థలూ మాకు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తేవడానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామంటున్నాయి. కొవ్వొత్తుల ర్యాలీలూ చేస్తామంటున్నాయి’ అని వివరించారు. వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు దానిని గాడిన పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలు, నేతలతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రజలు ఓటేశారని చెబుతుంటే జాతీయ స్థాయిలో నాయకులూ ఆశ్చర్యపోయారని సీఎం వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాత వీవీప్యాట్‌ల లెక్కింపు చేపడితే బాగుంటుందని మంత్రి కాలవ శ్రీనివాస్‌ టెలికాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. అందులో ఎలాంటి తేడా లేకపోతే ఓట్ల లెక్కింపు ప్రారంభించే విధానం అవసరమని తెలిపారు. ఈ విషయాన్ని కోర్టులో ప్రస్తావిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పారు. ‘మన పోరాటమంతా ఎన్నికల సంఘంపైనే.. ఇక్కడుండే అధికారులపై కాదు..’అని తెలిపారు. ఎన్నికల విధులను నిర్వహించే అధికారులను మినహాయిస్తే ఆ బాధ్యతలు లేని వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. గడచిన ఐదేళ్లలో అధికారులు బాగా సహకరించారని చంద్రబాబు ప్రశంసించారు. ఇప్పుడు వారిని కూడా కులం, మతం పేరుతో, వ్యక్తిగత ఎజెండాతో విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు.