Movies

అక్కినేనికి తిక్క రేగితే…

when anr gets mad

ఏఎన్నార్‌ సినిమా రంగంలో అడుగుపెట్టి, తన పాటలు తానే పాడుకునే దశలో ప్రతిభా వారి ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రం వచ్చింది. 1-6-1946 నాడు విడుదలై విజయం సాధించిన ఆ చిత్రంలో ఏఎన్నార్‌కి జోడీగా టి.జి కమలాదేవి నటించారు. అందులో ఆ ఇద్దరూ కలిసి ‘చల్‌.. చలో వయ్యారీ షికారీ’ అనే డ్యూయెట్‌ సొంతంగా పాడుకున్నారు. దానితో పాటు ఆరంభంలో వచ్చే ప్రార్థన గీతం ‘జైజై భైరవ త్రిశూలధారీ’ బృంద గీతాన్ని కన్నాంబతో కలిసి ఏఎన్నార్‌, టి.జి కమలాదేవి పాడారు. ఈ బృందగీతం రికార్డింగ్‌ అప్పటి శోభనాచల థియేటర్‌లో జరిగింది. మధ్యాహ్నం మొదలైన రికార్డింగ్‌ సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యలో బ్రేక్‌ ఇచ్చారు. అందరికీ ఆకలిగా ఉంది. టిఫిన్‌, కాఫీలు వచ్చాయి. కాని అప్పట్లో ఫీల్డ్‌లో సీనియర్‌ అయిన కన్నాంబకు మాత్రమే వాటిని సప్లై చేసి.. ఏఎన్నార్‌, టి.జి కమలాదేవి లాంటి జూనియర్‌ మోస్ట్‌ ఆర్టిస్టులకు కనీసం మంచి నీళ్లయినా ఇచ్చే నాథుడు లేకపోయడట. ఏఎన్నార్‌కి కోపం ముంచుకొచ్చిందట. టిఫిన్‌ పెట్టండి అని నోరు విప్పి అడిగేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చి, కోపంగా స్టూడియో బయటకు వెళ్లిపోయారట. మద్రాసు వెళ్లిన కొత్తల్లో కొనుగోలు చేసిన ర్యాలీ సైకిల్‌ వేసుకొని, లజ్‌ రోడ్డు వరకు వెళ్లి తనకు, తనతో పాటు హీరోయిన్‌గా నటించి, ఆ రోజు రికార్డింగ్‌లో పాడుతున్న టి.జి కమలాదేవికీ స్పెషల్‌ కేకులు కొని తెచ్చారట! అది చూసి ప్రొడక్షన్‌ వాళ్లు కుర్రాడికి పౌరుషం ఎక్కువే అనుకొన్నారట!