Agriculture

పెప్సికోకు ఒళ్లు బలిసింది

pepsico comes to an agreement with indian farmers on suing them for potatoes

ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళాదుంపల సాగును ఆపితేనే గుజరాత్‌కు చెందిన తొమ్మిది మంది రైతులపై తాము పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రముఖ శీతలపానీయాల సంస్థ పెప్సికో ఇండియా హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌ కోర్టులో కేసు దాఖలుకు ముందు ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు కంపెనీతో ఒప్పందం చేసుకుని, విక్రయాలు జరపవచ్చని కూడా పేర్కొంది. గుజరాత్‌కు చెందిన 9మంది రైతులు ఎఫ్‌సీ5 బంగాళాదుంప రకాన్నిసాగు చేసిన నేపథ్యంలో వారిపై వేర్వేరు కేసులు పెట్టింది. ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంప సాగుపై భారత్‌లో 2016 నుంచి 2031 తమకు హక్కులు ఉన్నాయని దీన్ని మరొకరు పండించేందుకు అవకాశం లేదని తెలిపింది. ప్లానెట్‌ వెరైటీ ప్రొటెక్షన్‌లో భాగంగా పీపీవీ, ఎఫ్‌ఆర్‌ చట్టం 2001 ప్రకారం ఇది తమకు చెందుతుందని పేర్కొంది. దీనిని ఉల్లంఘించి ఎఫ్‌సీ5 రకాన్ని సాగు చేసిన 9మంది రైతులు ఒక్కొక్కరుగా రూ.1.5కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోర్టును ఆశ్రయించింది. 2017-18లో కూడా ఇలాగే ఉత్తర గుజరాత్‌లోని ఐదుగురు రైతులపై పెప్సీకో దావా వేసింది. అయితే, ఈ బంగాళాదుంపల సాగు గురించి బిపిన్‌ పటేల్‌ అనే రైతు మాట్లాడుతూ.. ‘వారు చెబుతున్న ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపల విత్తనాలను మేము వాడలేదు. ఈ విత్తనాలను కొనడానికి బంగాళాదుంపలు విక్రయించడానికి తమతో ఒప్పందం చేసుకోవాలని పెప్సీకో కోరింది. అయితే, కనీస మద్దతు ధర కూడా మాకు లభించడం లేదని ఆ ప్రతిపాదనను తిరస్కరించాం.’ అని తెలిపారు. పెప్సీకో రైతులపై కేసులు నమోదు చేయడం పట్ల కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ తీవ్రంగా స్పందించారు. అదొక సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. రైతులు ఏవి పండించాలో.. ఏవి పండించకూడదో కార్పొరేట్‌ సంస్థలు నిర్ణయించడం దారుణమన్నారు.