Business

ఫలితాలు సాధించడానికి కష్టపడాలి

Maruti reducing expenses to aim further more profits in 2019

ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాలను పెంచడానికి మారుతీ భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఉత్పాదక వ్యయాలకు కళ్లెం వేయడంతోపాటు ఉత్పాదకతను కూడా పెంచి లాభాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ‘‘మేము వ్యయాలను తగ్గించడానికి తీవ్రంగా కష్టపడుతున్నాము. ప్రతి కంపెనీలాగే మేము కూడా లాభాలను పెంచుకునేందుకు కష్టపడతాము. దీనిలో భాగంగా స్థానికీకరణ చాలా ముఖ్యం. ఇప్పుడు ఇదే అత్యంత కీలకమైంది. ఒకప్పుడు విదేశీ భాగాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు దేశీయంగానే వాటిని తయారు చేయాలని చూస్తున్నాం. ఇక్కడి నుంచి మేము ఫలితాలు సాధించడానికి కష్టపడాలి. దీనికోసం ఇప్పటికే పలు రకాల భిన్నమైన కార్యక్రమాలు చేపట్టాము.’’ అని మారుతీ సుజుకీ సీఎఫ్‌వో అజేయ్‌ సేథి తెలిపారు. డీజిల్‌ ఇంజిన్‌ ప్లాంట్లను మార్చుకునే విషయంపై కూడా సేథీ స్పందించారు. మరి కొన్నేళ్లలో మారుతీ డీజిల్‌ వాహనాలకు స్వస్తి చెప్పనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టి డీజిల్‌ ప్లాంట్లపై ఆయన మాట్లాడారు. ‘‘99శాతం డీజిల్‌ ఇంజిన్‌ కర్మాగారాలను పెట్రోల్‌, సీఎన్‌జీ ఇంజిన్ల తయారీ కేంద్రాలుగా మారుస్తాము. దానిలోఎటువంటి ఇబ్బంది లేదు. ఒక వేళ ఉన్నా.. అది అంత ఎక్కువగా ఉండదు. మీరు ఆ కేంద్రాలను మార్చుకోలేకపోతే విదేశాల నుంచి కొనుగోలు చేయాలి. కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్లాంట్లలో మార్పులు చేస్తాము.’’ అని తెలిపారు.