Business

ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది

this indian guy from rajasthan makes more than an amazon manager selling tea online

ఒక్కప్పుడు టీవీలో పదినిమిషాలకు ఒకసారి ‘ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది!’ అంటూ యాడ్‌ వచ్చేది. నిజమే ఒక్కోసారి ఒక్క ఐడియా కొందరి జీవితాన్ని మార్చేస్తుంది. అచ్చు అలాంటి యువకుడే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రఘువీర్‌ సింగ్‌ చౌదరి. అతనిది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకు స్వస్తి చెప్పి, ఉద్యోగం చేయాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి అతనేమీ పెద్ద చదువులు చదవలేదు. అతికష్టం మీద అమెజాన్‌లో డెలివరీ బారుగా తొమ్మిది వేల రూపాయల జీతానికి కుదిరాడు. జైపూర్‌లాంటి నగరాల్లో డెలివరీ బారు అంటే ద్విచక్ర వాహనం అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఒక్క అడ్రస్‌ నుంచి మరో అడ్రస్‌కు చేరాలంటే కొన్ని మైళ్ల దూరం ఉంటుంది. కానీ రఘువీర్‌కు ద్విచక్ర వాహనం లేదు. తన దగ్గర ఉన్న సైకిల్‌ను తొక్కుకుంటూ ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రయ్యేది. టైం సరిపోదనే ఉద్దేశంతో ఒక్కోసారి మధ్యాహ్నం భోజనం కూడా చేసేవాడు కాదు. ఆకలి తట్టుకోలేక అప్పుడప్పుడూ ఆ ఏరియాల్లో ఉండే టీ దుకాణంలో టీ తాగేవాడు. కానీ కొన్ని ప్రాంతాల్లోనైతే టీ దుకాణాలు కూడా ఉండేవి కాదు. అలాంటప్పుడు ఆ పూట పస్తులుండేవాడు. ఒక్కోసారి ఆకలి వేసి కళ్లు తిరిగేవి. ఉదయం నుంచి సైకిల్‌ తొక్కీతొక్కీ కాళ్లు నొప్పులు వచ్చేవి. ఉద్యోగం మానేద్దామా? అంటే పెద్దగా చదువులేనందున మరెక్కడా అంత సులువుగా ఉద్యోగం దొరకదనేది అతనికి బాగా తెలుసు. అందుకే అంత కష్టాన్ని భరిస్తూ ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు అతనికి బ్రహాండమైన ఐడియా వచ్చింది. ‘కొన్ని ఏరియాల్లో టీ దొరకడం లేదు కదా! ఆన్‌లైన్‌ టీ డెలివరీ పెడితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించాడు. అలాగనుక చేస్తే తను ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అని ఆలోచించాడు. అందుకోసం ప్రతి ఏరియాలో స్థానిక టీ కొట్టు వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘ఈ నెంబర్‌కు మీరు ఫోన్‌ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మినరల్‌ వాటర్‌ను ఉపయోగించిన వేడివేడి టీ మీ ముందుంటుంది!’ అంటూ వాట్సప్‌ ద్వారా బాగా పబ్లిసిటీ ఇచ్చాడు. ఆ నోటా ఈ నోటా అతని బిజినెస్‌ కొన్నిరోజుల్లోనే అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం టీతోపాటు స్నాక్స్‌నూ జత చేశాడు. కష్టపడే వాడికి విజయం నిదానంగానైనా దక్కుతుంది. కొన్ని రోజుల్లోనే సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుక్కున్నాడు. మొదట్లో రోజుకు వంద ఆర్డర్లు వచ్చేవి. రానురాను రోజుకు 500 నుంచి 700 దాకా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకు దాదాపు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. తన స్వస్థలం అయిన జైపూర్‌లోని నాలుగు ఏరియాల్లో బిజినెస్‌ను నడుపుతున్నాడు. కొత్తగా నాలుగు బైక్‌లను కొన్నాడు. తనతో పాటు మరో నలుగురు డెలివరీ బార్సుతో కలిసి వ్యాపారాన్ని విజయపథం వైపు నడిపిస్తున్నాడు రఘువీర్‌సింగ్‌.