ScienceAndTech

అంతర్జాలాన్ని శాసించడమే “కూపర్” లక్ష్యం

The Internet Controlling Monster Called Project Kuiper By Amazon

ఒకప్పుడు గాలి, నీరు, నిప్పు, నేల, నింగి లేకపోతే మనిషి లేడు అనుకునేవారు.. ఇప్పుడు ఈ పంచభూతాలకు తోడు మరో కొత్త భూతం వచ్చి చేరింది. అదే ఇంటర్నెట్‌. ఆ కొత్త భూతాన్ని తమ అద్భుత దీపంలో బంధించేందుకు అపర కుబేరులు.. బిజినెస్‌ టైకూన్‌లు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరెంట్‌ బిల్లు.. కిరాణా సామాను.. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌.. వాహనాల కొనుగోళ్లు, అమ్మకాలు.. ప్రయాణ టికెట్ల బుకింగ్‌.. సరికొత్త కోర్సులు.. కొత్త వంటలు.. పిల్లల పెంపకం.. విద్యుత్తు సరఫరా.. ఇలా చెప్పుకొంటూపోతే ఇంటర్నెట్‌ అందించని సేవలు అంటూ ఏమీ లేవనిపిస్తుంది. అందుకే ఇంటర్నెట్‌పై తిరుగులేని పట్టు సాధించిన వారు ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా నగదు నిల్వలు ఉన్న సంస్థల్లో అమెజాన్‌ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహంలేదు. ఈ సంస్థ ఇప్పుడు సరికొత్త రంగాల్లో పాగా వేసి ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం ఆధునిక మానవుడికి ప్రాణవాయువుతో సమానమైన ఇంటర్నెట్‌పై పట్టు సాధించాలని సంకల్పించింది. దీనికోసం ప్రాజెక్టు ‘క్యూపర్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా భూమండలంలో అణువణువును కవర్‌ చేసేలా దాదాపు 3,236 ఉపగ్రహాలను ‘లోఎర్త్‌ ఆర్బిట్‌(తక్కువ ఎత్తు గల కక్ష్య)’లోకి ప్రయోగించాలని నిర్ణయించింది. తీగలు, టవర్లతో సాధ్యంకాని ప్రాంతాలకు కూడా ఈ శాటిలైట్ల ద్వారా అంతర్జాలాన్ని అందించాలని నిర్ణయించింది. దీనికి తోడు ఇంటర్నెట్‌ ప్రజల్లోకి ఎంత లోతుగా చొచ్చుకెళితే అమెజాన్‌కు అంత ప్రయోజనం ఉంటుంది. తన ఆన్‌లైన్‌ వ్యాపారం అంతగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని అమెజాన్‌ అనుబంధ సంస్థ క్యూపర్‌ సిస్టమ్స్‌ పర్యవేక్షిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును బలమైనా వ్యాపార భాగాస్వాములతో పంచుకోవాలని కూడా భావిస్తోంది. ఇప్పటికే అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌కు ‘బ్లూ ఆరిజిన్‌’ పేరుతో రాకెట్ల తయారీ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ స్పేస్‌ టూరిజం, ఉపగ్రహ ప్రయోగాల కోసం రాకెట్లను తయారు చేయనుంది. ఆర్బిటల్‌ శ్రేణి రాకెట్‌ తయారీ దశలో ఉంది. 2021నాటికి తొలి రాకెట్‌ను ప్రయోగించే అవకాశముంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఇంటర్నెట్‌ను ఒడిసిపట్టేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టాయి. దీనిలో అలెన్‌ మస్క్‌ మానసపుత్రిక స్పేస్‌ ఎక్స్‌ కొంచెం ముందుంది. లోఎర్త్‌ ఆర్బిట్‌లోకి 12,000 ఉపగ్రహాలను ప్రయోగించి భూమిని కవర్‌ చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం 2020 లేదా 2021 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెజాన్‌తో పోలిస్తే టెస్లాకు నిధుల కొరత అధికంగా ఉంటుంది. అందుకే కొంత నిదానంగా ఈ ప్రాజెక్టు జరిగే అవకాశం ఉంది. ఇక వినూత్న వ్యాపారవేత్త రిచర్డ్‌ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్‌ గ్రూప్‌, జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌, కోకో కోలా, క్వాల్‌కామ్‌, ఎయిర్‌ బస్‌లు కలిసి ‘వన్‌వెబ్‌’ సంస్థ సాయంతో 650 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించాయి. అంతేకాదు ఫేస్‌బుక్‌, బోయింగ్‌ కూడా జట్టు కట్టి ఇంటర్నెట్‌ సేవలు అందించాలని భావిస్తున్నాయి. అమెజాన్‌ 367 మైళ్ల వద్ద 784 ఉపగ్రహాలు, 379 మైళ్ల వద్ద 1,296 ఉపగ్రహాలను, 391 మైళ్ల వద్ద 1,156 ఉపగ్రహాలను ఉంచనుంది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ప్రాజెక్టులు పూర్తి అయితే లోఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లతో కిక్కిరిసిపోతుంది. దీనికి తోడు ఇన్ని ఉపగ్రహాలను ప్రయోగిస్తే అంతరిక్షంలో పేరుకుపోయే వ్యర్థాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. మొత్తం 17కోట్ల వ్యర్థాలు ఇప్పటికే ఉన్నట్లు అంచనా. వీటిల్లో 10 సె.మీ కంటే ఎక్కువ ఉన్నవి 20 వేలకు పైగా ఉన్నాయి. 5-1 సె.మీ. మధ్యలోనివి దాదాపు 5లక్షలు ఉన్నాయి. సె.మీ. కంటే తక్కువ ఉన్నవి దాదాపు కోటికి పైగా ఉన్నాయి. ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఇవి ఢీకొంటే కక్ష్యలోని ఉపగ్రహాలు ఘోరంగా దెబ్బతింటాయి.