Business

భారతావనిని తగలబెట్టనున్న చమురు యుద్ధం

america oil war with iran causes huge stir and problems in india to its customers

మే1 నుంచి ఇరాన్‌ నుంచి భారత్‌ చమురు దిగుమతులు నిలిచిపోనున్నాయి. ఒక్క భారత్‌ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలకు ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపులను కూడా నిలిపివేసింది. దీంతో ఇరాన్‌ నుంచి ఆయా దేశాలు చమురు కొనుగోళ్లను నిలిపివేయనున్నాయి. ఒక్క చైనా, టర్కీ మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించాయి. మిగిలిన దేశాలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొనే పనిలో పడ్డాయి. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. దీంతో భారత్‌పై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది. చమురు అత్యధికం ఉత్పత్తి చేసే దేశాల్లో వెనుజువెలా, ఇరాన్‌ కీలకమైనవి. వీటి నుంచి ఎగుమతులు నిలిచిపోతే ఆమేరకు చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. డిమాండ్‌ పెరిగే కొద్దీ ముడి చమురు ధర చుక్కల్ని తాకుతుంది. ఇప్పటికే ఈ ఏడాది బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు 33శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో అత్యధిక ధరకు సమీపంలో ఉంది. ఫలితంగా ఇరాన్‌, వెనుజువెలా తప్ప మిగిలిన చమురు ఉత్పాదక దేశాల సంస్థలకు, ప్రభుత్వాలకు కనకవర్షం కురవనుంది. కానీ, దిగుమతి చేసుకొనే దేశాలు అధిక ధరల భారాన్ని మాత్రం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది అంతిమంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును దారుణంగా దెబ్బతీసే ప్రమాదముంది. ప్రపంచ జనాభా ఆదాయ వ్యయాలను పెరుగుతున్న చమురు ధరలు దెబ్బతీస్తాయి. ద్రవ్యోల్బణాన్ని దెబ్బతీస్తాయి. ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి చేసుకొనే చైనా కూడా దీని నుంచి ఇబ్బందులు ఎదుర్కోనుంది. యూరప్‌లోని చాలా దేశాలు చమురు దిగుమతులపైనా ఆధారపడ్డాయి. దీనికి తోడు యూరప్‌లో చలికాలంలో చమురుకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. చమురు వ్యయాలు పెరిగి మిగిలిన వస్తువులకు డిమాండ్‌ తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముంది. మరోపక్క చమురు ధర వేగంగా 100 డాలర్ల పైకి చేరటం అనేది డాలర్‌ బలపడటంపై ఆధారపడి ఉంటుంది. 2019 చివరి నాటికి బ్రెంట్‌ క్రూడ్‌ ధర 100 డాలర్లకు చేరితే 2020 సంవత్సరానికి అంచనా వేసిన ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 0.6శాతం తగ్గుతుంది. మరోపక్క ప్రపంచ ద్రవ్యోల్బణం కూడా 0.7శాతం పెరుగుతుంది. ఇప్పటికైతే చమురు ఉత్పత్తిని పెంచుతామని అమెరికా మిత్రదేశాలు చెబుతున్నాయి. కానీ ఏదైనా సమస్య ఎదురై అక్కడ చమురు ఉత్పత్తి తగ్గితే మాత్రం ధరలు ఆకాశాన్నంటుతాయి.