Sports

నాడు లేవు – నేడు సువర్ణ యుగం

Kapildev during his time back then on biopics

క్రీడా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించేందుకు ఒకప్పుడు భారత్‌లో ఆ అవకాశాలు లేవని అంటున్నారు లెజండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌. ఆయన జీవితాధారంగా బాలీవుడ్‌లో ‘83’ అనే సినిమా తెరకెక్కుతోంది. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా జట్టు ప్రపంచ కప్‌ను ఎలా సాధించింది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను కబీర్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కపిల్‌ దేవ్‌ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ..’ఇరవై ఏళ్ల క్రితం క్రీడా నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించే అవకాశం భారత్‌లో లేదు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయంటే అది మంచి మార్పనే చెప్పాలి. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో క్రీడా నేపథ్యానికి సంబంధించిన చాలానే సినిమాలు వచ్చాయి. ‘మేరీ కోమ్‌’, ‘ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’, ‘దంగల్‌’, ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’..ఈ సినిమాలకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు భారత్‌ నిజ జీవిత కథలను తెరపై చూపించేందుకు సిద్ధంగా ఉంది. ‘83’ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌ నా పాత్రలో నటిస్తున్నారు. తను బాగా చేయగలడా? నా పాత్రలో సరిపోతాడా? అన్న విషయాలపై నేను నిర్ణయం తీసుకోలేను. కానీ రణ్‌వీర్‌లో చాలా ఎనర్జీ ఉంది. దాంతో నూటికి నూరు శాతం సినిమాకు న్యాయం చేస్తాడని, సినిమాలో నటిస్తున్నవారంతా విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తారన్న నమ్మకం ఉంది’ అని వెల్లడించారు.