Movies

చెత్త వాగుడు కట్టిపెట్టండి

old actress mumtaz is not dead

అలనాటి తార ముంతాజ్‌ మరణించారని వచ్చిన వార్తల్ని ఆమె కుమార్తె తన్య ఖండించారు. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్‌ చేశారు. ఇలాంటి వదంతుల్ని ప్రచారం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సినీ, ట్రేడ్‌ అనలిస్ట్‌ కోమల్‌ నాహ్తా ముంతాజ్‌ గుండెపోటుతో కన్నుమూశారని, శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారని పోస్ట్‌ చేశారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన నెటిజ‌న్స్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాల‌ని కోరుతూ కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో తన్య మాట్లాడుతూ.. ‘మా అమ్మ మృతిపై మరోసారి వదంతులు రావడం చూసి నాకు విసుగొచ్చింది. ఆమె ఎప్పటిలాగే ఆరోగ్యంగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నారు. తను ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని అభిమానులకు చెప్పమని అమ్మ నాతో అన్నారు. అవన్నీ చెత్త వార్తలు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా దర్శకుడు మిలాప్‌ జవేరీ కూడా ఈ వదంతులపై స్పందించారు. ‘ముంతాజ్‌ ఆంటీ ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం ఎంతో బాగుంది. ఇప్పుడే ఆమె మేనల్లుడితో మాట్లాడాను. ఇలాంటి వార్తల్ని ప్రచారం చేయొద్దని ఆమె కోరారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో కోమల్‌ నాహ్తా క్షమాపణలు చెప్పారు. తనకు చిత్ర వర్గాల నుంచి తప్పుడు సమాచారం వచ్చిందని చెప్పారు. బాల‌న‌టిగా కెరీర్‌ ప్రారంభించిన ముంతాజ్ 70వ ద‌శకంలో టాప్ డ్యాన్సర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు.