Devotional

ఒరిస్సాకు ₹10లక్షలు ప్రకటించిన దలైలామా

Dalai Lama Donates 10Lakh INR To Orissa Cyclone Fani Victims

ఫొని తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు ఆధ్యాత్మిక గురువు దలైలమా రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాశారు. ‘ రాష్ట్రంలో జరుగుతున్న పునరావాస చర్యల కొరకు నా వంతుగా దలైలమా ట్రస్ట్‌ తరఫున రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నాను.’ అని లేఖలో పేర్కొన్నారు. తుపాను తాకిడితో మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కొన్ని లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించడంలో సఫలీకృతమైన నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ ప్రకృతి వైపరీత్యంతో రాష్ట్రంలో సుమారు 34 మంది మృతి చెందగా, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తుపాను వల్ల కోలుకోలేని దెబ్బతిన్న ఒడిశాకు ఇతర రాష్ట్రాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలూ బాసటగా నిలుస్తున్నాయి. శుక్రవారం తుపాను తీరం దాటే క్రమంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసి ఒడిశా ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. దీంతో రాష్ట్రంలోని భువనేశ్వర్‌, కటక్‌, పూరీ, ఖుర్దా జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది.