Business

APSRTC సమ్మె

national majdur union gives strike notice to apsrtc

ఏపీఎస్‌ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి ప్రధాన కార్మిక సంఘం ఎన్‌ఎంయూ బుధవారం సమ్మె నోటీసు ఇచ్చింది. 46 డిమాండ్లతో కూడిన నోటీసును ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబుకు ఆ సంఘం నేతలు అందజేశారు. కార్మికులకు వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించడంతో పాటు సిబ్బంది కుదింపు, గ్రాట్యుటీ తగ్గింపు తదితర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అద్దె బస్సుల పెంపు నిర్ణయాన్ని సైతం ఉపసంహరించుకోవాలని నోట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్టీసీ పరిరక్షణకు కృషిచేయాలని కోరారు. లేకపోతే ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేస్తామని ఎన్‌ఎంయూ హెచ్చరించింది. మరోవైపు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు గురువారం సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గతేడాది డిసెంబర్‌లో ఆర్టీసీలో ప్రధాన కార్మిక సంఘాలన్నీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంకాగా ప్రభుత్వం స్పందించి డిమాండ్ల పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు పిబ్రవరి 5న రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘాల నేతలతో సమావేశమై వేతన సవరణ బకాయిల డిమాండ్‌ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 2003 నుంచి ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఉగాది రోజునే చెల్లించేందుకు అంగీకరించారు. అయితే, ఇప్పటివరకు చెల్లింపులు జరగకపోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తిరిగి ఆందోళన బాట పట్టాయి.

*** ఎన్‌ఎంయూ ప్రధాన డిమాండ్లలో కొన్ని..
* ఆర్టీసీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.650 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలి.
* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
* నష్టాల నుంచి బయటపడేలా ఏటా కొత్త బస్సుల కొనుగోలుకు రూ.1000 కోట్లు బడ్జెట్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.
* కార్మికుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలి.