Sports

కుంబ్లే సరైన వ్యక్తి

Sehwag Recommends Kumble To Be The Chief Selector-కుంబ్లే సరైన వ్యక్తి

ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే సామర్థ్యమున్న టీమిండియా మాజీ సారథి అనిల్‌ కుంబ్లే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవికి సరైన అభ్యర్థని మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు.ఈ ప్రకటనతో విరాట్‌ కోహ్లీ గుండెల్లో బాంబు పేల్చాడు! ఐతే అంతకన్నా ముందు సెలక్లర్ల జీతభత్యాలను భారీగా పెంచాలని బీసీసీఐకి సూచించాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్‌ కమిటీ సభ్యులంందరికీ 13 టెస్టుల అనుభవమే ఉండటంతో పదేపదే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవికి అనిల్‌ కుంబ్లే సరైన వ్యక్తని నా అభిప్రాయం. ఆటగాడిగా సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌తో ఆయనకు అనుబంధం ఉంది. కోచ్‌గా యువకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను జట్టులో పునరాగమనం (2007-08 ఆస్ట్రేలియా సిరీస్‌) చేసినప్పుడు కెప్టెన్‌గా నా గదికి వచ్చి తర్వాతి రెండు సిరీస్‌ల వరకు జట్టులోంచి తొలగించనని నాకు చెప్పాడు. అలాంటి విశ్వాసమే ఆటగాడికి కావాల్సింది. ఇక సెలక్లర్ల జీతభత్యాలను బీసీసీఐ పెంచాల్సి ఉంది. అప్పుడే ఎక్కువ క్రికెటర్లు ఆ పదవిపై ఆసక్తి చూపిస్తారు’ అని వీరూ అన్నాడు. ప్రస్తుతం ఛైర్మన్‌కు ఏడాదికి కోటి రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటం గమనార్హం. సెలక్టర్‌గా పనిచేయడం మీకిష్టమేనా అన్న ప్రశ్నకు ‘నేను కాలమ్స్‌ రాస్తాను. టీవీల్లో కనిపిస్తాను. సెలక్టర్‌ ఐతే ఎన్నో ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ని ఆంక్షలు నేనిష్టపడతానో లేదో తెలీదు’ అని వీరూ అన్నాడు. ఈ సారి కోచ్‌ పదవికి తాను దరఖాస్తు చేయలేదని వెల్లడించాడు. ‘2017లో బీసీసీఐ కార్యదర్శి అయిన ఎంవీ శ్రీధర్‌ (దివంగత) కోరడంతో కోచ్‌ పదవికి నేను దరఖాస్తు చేశాను. ఇప్పుడెవరూ అడగలేదు. అందుకే చేయలేదు. ఇక పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన కష్టంగా ఉంది. ఒకవేళ నేను సెలక్టరైతే క్రికెట్‌ అకాడమీ నడపకూదని అర్థం చేసుకోగలను. మరి కోచైతే మాత్రం ఎందుకు నడపొద్దో తెలియడం లేదు’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.