సెక్రటేరియెట్‌ను ఇంప్లోజన్ పద్ధతిలో కూల్చడానికే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ముంబై, చైనా కంపెనీలతో చర్చిన్నట్టు తెలిసింది. సచివాలయంలోని జే, ఎల్ బ్లాక్‌లు మినహా మిగతావన్నీ ఐదంతస్తుల్లోపే ఉన్నందున ఈ పద్ధతిలో నిమిషాల్లో కూల్చేయొచ్చని, సమస్య రాదని ఆర్ అండ్ బీ అధికారులు భావిస్తున్నట్టు సమచారం. ఇదే విషయాన్ని మొన్న మంత్రుల కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు మొదలు కానున్నాయి. సెప్టెంబర్ చివరి కల్లా కూల్చివేత, చదును పనులు పూర్తి చేసి అదే నెలలో నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసే అవకాశముంది. దసరా తర్వాత నిర్మాణ పనులు మొదలుపెడతారని సమచారం. ఇంప్లోజన్ పద్ధతిలో 10 నుంచి 15 అంతస్తులున్న బిల్డింగును 15 నుంచి 30 నిమిషాల్లో కూల్చేయొచ్చు. ఆ ప్రకారం సెక్రటేరియెట్ కూల్చివేతకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఖర్చవనున్నట్టు తెలుస్తోంది. ప్రతి బ్లాక్‌లోని పిల్లర్లకు జిలిటెన్ స్టిక్స్ అమర్చి బిల్డింగులను కూల్చనున్నారు. అయితే పేలుడు దెబ్బకు శకాలాలు చెల్లాచెదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున దుమ్ము కూడా వెలువడుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మరి సెక్రటేరియట్ చుట్టూ లుంబినిపార్కు, హోటళ్లు, విద్యుత్ శాఖ, మింట్ కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్ ఉండటంతో కూల్చివేత టైంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చర్చ నడుస్తోంది. కూల్చాక ఇనుప చువ్వలను వేరు చేయడం, కాంక్రీట్‌ను నగర శివారులకు తరలించడానికి భారీ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. సెక్రటేరియెట్ కూల్చివేత, అసెంబ్లీ తరలింపుపై రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీకి బుధవారం నివేదికిచ్చింది. పరిశీలించిన మంత్రుల కమిటీ ఆ నివేదికను గురువారం పొద్దున సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు వెళ్లే ముందు అందించింది. ఆ టైంలోనే సెక్రటేరియెట్ షిఫ్టింగ్ ఎంతవరకు వచ్చిందని మంత్రులను సీఎం ప్రశ్నించగా 70 శాతం పూర్తయిందని చెప్పినట్టు తెలిసింది. మిగతా పనిని త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.
తెలంగాణా సచివాలయాన్ని ఇలా కూలుస్తారు
Related tags :